The Paradise: ‘పెద్ది’ రిజల్ట్ చూశాక కూడా ‘ది పారడైజ్’ పాఠాలు నేర్వలేదా?

The Paradise

The Paradise

The Paradise: పాన్ ఇండియా స్థాయి సినిమాల్లో కథ ఎంత బలంగా ఉన్నా, హీరోయిన్ పాత్రల చిత్రీకరణలో హద్దులు దాటితే ప్రేక్షకుల నుంచి ఎలాంటి వ్యతిరేకత వస్తుందో రామ్ చరణ్ ‘పెద్ది’ ఇప్పటికే కళ్ళముందు నిలిపింది. అంత పెద్ద వివాదం జరిగి, విమర్శల సెగ తాళలేక ఆ చిత్రంలోని సీన్లను కట్ చేయాల్సి వచ్చినా.. దర్శకులు మాత్రం గుణపాఠం నేర్చుకోలేదన్న విమర్శలు మళ్లీ స్టార్ట్ అయ్యాయి. తాజాగా నాని-శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన ‘ది పారడైజ్’లో హీరోయిన్‌గా నటించిన కయాదు లోహర్ పాత్రను తెరకెక్కించిన తీరు సరిగ్గా అదే బాటలో పయనించిందంటూ నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు.

గతంలో వచ్చిన అనుభవాలను సినీ వర్గాలు ఎందుకు విస్మరిస్తున్నాయనే చర్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రధానంగా సాగుతుంది. ‘దేవర’లో జాన్వీ కపూర్‌ను కేవలం గ్లామర్ కోసమే పరిమితం చేశారన్న విమర్శలు వస్తే, బుచ్చిబాబు తెరకెక్కించిన ‘పెద్ది’ చిత్రం నాటికి పరిస్థితి మరింత తీవ్రమైంది. గ్రామీణ నేపథ్యం పేరిట జాన్వీ పాత్రను అసభ్యకరంగా, చీప్‌గా చూపించారంటూ సినిమా రిలీజ్ టైంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. రామ్ చరణ్ అత్యుత్తమ నటనకు రావాల్సిన ప్రశంసలను సైతం ఆ వివాదం పూర్తిగా పక్కదారి పట్టించింది. నాలుగు గంటల నిడివితో వచ్చిన సినిమాను దాదాపు 2 గంటల 50 నిమిషాలకు తగ్గించడమే కాకుండా, విమర్శలకు గురైన ఆ సీన్లను తప్పనిసరి పరిస్థితుల్లో ట్రిమ్ చేయాల్సి వచ్చింది.

‘పెద్ది’ తెచ్చిన చేదు అనుభవాన్ని ముందే చూసినా, ‘ది పారడైజ్’ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల సైతం హీరోయిన్ పాత్ర విషయంలో అదే పొరపాటు చేశారని నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. ‘అల్లూరి’, ‘ఫంకీ’ నిరాశపరిచినా, డబ్బింగ్ హిట్ ‘డ్రాగన్’తో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న కయాదు లోహర్.. నాని పక్కన పాన్ ఇండియా అవకాశాన్ని ఇలాంటి ‘బి-గ్రేడ్’ తరహా క్యారెక్టర్‌తో పాడుచేసుకుందని నెటిజన్లు విమర్శిస్తున్నారు. కథ విన్నప్పుడు హీరోయిన్ ఎలా ఒప్పుకుంది? ఫస్ట్ కాపీ చూసుకున్నాక హీరో, నిర్మాతలకు ఆ సన్నివేశాలు అలాగే ఉంచాలని ఎలా అనిపించింది? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. కయాదు పాత్రకు సంబంధించిన అభ్యంతరకర సన్నివేశాల్లో కనీసం సగం భాగాన్ని తొలగించి ఉంటే సినిమాకు ఈ స్థాయిలో మిశ్రమ టాక్, నెగెటివిటీ వచ్చేది కాదని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. కథకు అవసరం లేని బోల్డ్‌నెస్, మహిళా పాత్రలను దిగజార్చి చూపించే ధోరణి సినిమాపై వచ్చే పాజిటీవ్ అంశాలను కూడా దెబ్బతీస్తుందనడానికి ‘పెద్ది’ స్పష్టమైన ఉదాహరణగా నిలిచిందని కామెంట్స్ చేస్తున్నారు. అయినా ఆ రిజల్ట్ నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకోకుండా ‘ది పారడైజ్’లో మళ్లీ అదే విధమైన క్యారెక్టరైజేషన్‌ను రుద్దడం ఇప్పుడు చిత్ర వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం తెచ్చిపెట్టిందని అంటున్నారు. ఇప్పటికైనా దర్శకులు హీరోయిన్ పాత్రల విషయంలో కాస్త ఆలోచించి అడుగులు వేయకపోతే చేజేతులా ప్రాజెక్టులను దెబ్బతీసుకున్నట్లే అవుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.