అమెరికా అగ్ర రాజ్యం అవ్వటానికి కారణం ఏంటో తెలుసా? కొందరి మాటైతే అక్కడి ‘క్యాపిటలిజమ్’! అవును, అమెరికాలో దేన్నైనా ‘వ్యాపారం’ చేసేస్తారు. ఈ కామెంట్ ని నెగటివ్ గా తీసుకోవాల్సిన పని కూడా లేదు. ఇన్ ఫ్యాక్ట్… భయంకరమైన బాంబులు, దారుణమైన గన్నులు కూడా ఎడాపెడా అమ్మేసి సొమ్ము చేసుకునే యూఎస్ వినోదాన్ని వదిలి పెడుతుందా?
అమెరికాలో హాలీవుడ్ తో కలుపుకుని ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ చాలా పెద్దది. అందుకే, క్రమంగా అక్కడ సినిమా, వినోదం, వ్యాపారం అన్నీ కలగలిసిపోయాయి. ఇందుకు తాజా ఉదాహరణ జూన్ రెండున ప్రారంభం కానున్న ‘వెబ్ స్లింగర్స్ : ఏ స్పైడర్ మ్యాన్ అడ్వంచెర్’. ఇంతకీ ఏంటది అంటారా?
‘వెబ్ స్లింగర్స్’ ఒక ఇంటరాక్టివ్ స్క్రీన్ రైడ్! అంటే, జనాలు తమ చేతికి అమర్చిన వివిధ రకాల అత్యాధునిక పరికరాల సాయంతో తెర మీద కనిపిస్తోన్న బొమ్మల్ని నచ్చినట్టు ఆడించవచ్చు! ఓస్… వీడియో గేమా అనేయకండి! ఎందుకంటే, ‘వెబ్ స్లింగర్స్’ అంతకంటే చాలా చాలా ఎక్కువ. కాలిఫోర్నియా నగరంలోని డిస్నీ ఎంటర్టైన్మెంట్ పార్క్ లో దీన్ని జూన్ నుంచీ అందుబాటులోకి తేబోతున్నారు. కరోనా లాక్ డౌన్ తరువాత క్రమంగా కోలుకుంటోన్న అమెరికాకి ఇది కూడా ఓ సరికొత్త ఆకర్షణ కాబోతోంది.
‘వెబ్ స్లింగర్స్’ ఇంటరాక్టివ్ స్క్రీన్ రైడ్ లో అతిథులకి అత్యాధునిక అనుభూతి కలగబోతోంది. సొఫెస్టికేటెడ్ టెక్నాలజీ సాయంతో గేమ్ ఆడుతోన్న వ్యక్తినే స్పైడర్ మ్యాన్ గా మార్చేస్తారు! అచ్చు హాలీవుడ్ సూపర్ హీరోలాగే తెర మీద ఒళ్లు గగుర్పొడిచే సాహసాలు చేయవచ్చు. దానికి తగ్గ సౌండ్ అండ్ లైట్ కూడా ఉంటాయి! మరి ఇంత హంగామా చేశాక డాలర్లు వదిలించకుండా ఉంటారా? డిస్నీ ఇంకా ‘వెబ్ స్లింగర్స్’ రేటు ప్రకటించలేదు. కానీ, కాస్త భారీగానే ఉండవచ్చని అంచన! హాలీవుడ్ మూవీ ‘అవెంజర్స్’ ప్రేరణగా రూపొందిన ఈ ‘వెబ్ స్లింగర్స్’లో స్పైడర్ మ్యాన్ వద్దనుకున్న వారు ఐరన్ మ్యాన్ కూడా అవ్వొచ్చట!