Tamannaah: బోల్డ్ సీక్వెల్‌లో తమన్నా? విద్యాబాలన్ మార్క్‌ను దాటగలదా!

The Dirty Picture 2

The Dirty Picture 2

Tamannaah భారతీయ చిత్ర పరిశ్రమలో పెను సంచలనం సృష్టించిన బోల్డ్ బయోపిక్ ‘ది డర్టీ పిక్చర్’. దాదాపు పదిహేనేళ్ల తర్వాత ఈ ఐకానిక్ సినిమాకు సీక్వెల్ రాబోతోందంటూ ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ చేసిన అధికారిక ప్రకటన బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఈసారి సీక్వెల్ సిల్క్ స్మిత జీవిత కథ కాదని తేల్చిచెప్పడం, లీడ్ రోల్ కోసం మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా పేరు తెరపైకి రావడం ఇప్పుడు సినీ వర్గాల్లో అత్యంత ఆసక్తికరంగా మారింది. 2011లో విడుదలైన ది డర్టీ పిక్చర్‌ సిల్క్ స్మిత జీవితాన్ని తెరపై ఆవిష్కరించి బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొట్టింది. కానీ తాజా సీక్వెల్‌పై ఏక్తా కపూర్ స్పందిస్తూ.. ఇది సిల్క్ స్మిత ప్రయాణం కాదని స్పష్టం చేశారు. సమాజపు కట్టుబాట్లను ఎదురించి నిలిచిన మరో పవర్‌ఫుల్ లేడీ జీవితం, ఆమె వ్యక్తిగత స్వేచ్ఛ, ఎదుర్కొన్న పోరాటాల చుట్టూనే ఈ రెండో భాగం తిరుగుతుందని వెల్లడించారు. స్టోరీ లైన్‌పై ఇచ్చిన ఈ క్లారిటీతో, ఈసారి ఎవరి జీవితాన్ని, ఎలాంటి బోల్డ్ కాన్సెప్ట్‌ను వెండితెరపై చూపిస్తారనే ఉత్కంఠ మొదలైంది.

ఇక ఈ ప్రాజెక్ట్‌లో ప్రధాన పాత్ర కోసం వినిపిస్తున్న పేర్లలో తమన్నా భాటియా, ‘యానిమల్’ ఫేమ్ తృప్తి దిమ్రి ముందు వరుసలో ఉన్నారు. ముఖ్యంగా తమన్నా ఈ పాత్ర దక్కించుకుంటే అది ఆమె కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, క్లిష్టమైన సవాలుగా మారడం ఖాయం అనే కామెంట్స్ జోరుగా వినిపిస్తున్నాయి. ‘లస్ట్ స్టోరీస్ 2’, ‘జైలర్’, ‘స్త్రీ 2’ వంటి ప్రాజెక్ట్‌లతో ఇప్పటికే నార్త్, సౌత్ అనే తేడా లేకుండా సరికొత్త క్రేజ్ సొంతం చేసుకున్న తమన్నా, బోల్డ్ అండ్ ఎమోషనల్ పాత్రలను సమర్థంగా పోషించగలదని నిరూపించుకుంది. అయితే ఫస్ట్ పార్ట్‌లో విద్యాబాలన్ చూపించిన నట విశ్వరూపం, పలికించిన భావోద్వేగాలు భారతీయ సినీ చరిత్రలోనే ఒక బెంచ్‌మార్క్‌గా మిగిలిపోయాయి. ఆ స్థాయి ఇంటెన్సిటీని అందుకోవడం, విద్యాబాలన్ సృష్టించిన ఇంపాక్ట్‌ను అధిగమించడం ఎవరికైనా కత్తిమీద సామే. ఒక వేళ సెకండ్ పార్ట్‌లో తమన్నా లీడ్ రోల్‌కి సెలక్ట్ అయితే ఈ పోలికలను తట్టుకుని నిలబడటం మిల్కీ బ్యూటీకి అసలైన పరీక్షగా మారనుంది. ప్రస్తుతానికి నటీనటులు, దర్శకుడు, విడుదల తేదీలపై చిత్ర బృందం పూర్తి గోప్యత పాటిస్తోంది. కాస్టింగ్‌పై అధికారిక ప్రకటన వస్తే తప్ప ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్‌లో ఎవరు ఫైనల్ అయ్యారో తెలియదు.