Site icon NTV Telugu

TFI: తెలుగు సినీ పరిశ్రమలో చారిత్రాత్మక అడుగు.. ఇకపై డిజిటల్ దుష్ప్రచారానికి చెక్!

Tfi Historic Decision

Tfi Historic Decision

తెలుగు సినీ పరిశ్రమ చరిత్రలో తొలిసారిగా సినిమాలపై జరుగుతున్న డిజిటల్ మానిప్యులేషన్‌, ఆన్‌లైన్ దుష్ప్రచారాన్ని అడ్డుకునే దిశగా కీలక అడుగు పడింది. కోర్టు ఆదేశాల మేరకు ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాకు సంబంధించి టికెటింగ్ ప్లాట్‌ఫామ్‌లలో రేటింగ్స్‌, రివ్యూలను చట్టబద్ధంగా నియంత్రించేలా చర్యలు చేపట్టారు. దాంతో నిజమైన ప్రేక్షకుల తీర్పుకు ఎలాంటి అడ్డంకులు లేకుండా, కావాలని చేసే దుష్ప్రచారానికి బ్రేక్ పడినట్లయింది. ఇది ఇప్పటివరకు ఎప్పుడూ లేని వినూత్న నిర్ణయంగా సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.

ఇటీవలి కాలంలో సినిమాలపై కృత్రిమ రివ్యూలు, బాట్స్‌, అజెండాతో నడిచే నెగటివ్ క్యాంపెయిన్లు పెరిగిపోయాయి. సినిమా విడుదలైన క్షణాల్లోనే నెగటివ్ టాక్‌ను వ్యాప్తి చేయడం పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కే సినిమాల భవిష్యత్తు కొందరి స్వార్థపూరిత ఎజెండాలతో బూడిదలో పోసిన పన్నీరవుతోంది. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని వల్ల ప్రేక్షకుల అభిప్రాయాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నాలకు అడ్డుకట్ట పడుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దర్శకులు, నిర్మాతలు మాత్రమే కాకుండా మొత్తం క్రియేటివ్ ఎకోసిస్టమ్‌కు రక్షణ కల్పించాలన్నదే ప్రధాన ఉద్దేశం.

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించారు. ఈ సినిమా కోసం కోర్టు మద్దతుతో అమలైన ఈ డిజిటల్ సేఫ్‌గార్డ్స్‌.. భవిష్యత్తులో ఇతర సినిమాలకు కూడా మార్గదర్శకంగా నిలిచే అవకాశముంది. ఇది నైతికమైన డిజిటల్ ప్రవర్తనకు నాంది పలుకుతుందని భావిస్తున్నారు. ఈ విప్లవాత్మక చర్యకు బ్లాక్‌బిగ్, ఐప్లెక్స్ సంస్థలు ముందుండి నడిచాయి. భారత్ డిజిటల్ మీడియా ఫెడరేషన్ సహకారం అందించడం విశేషం.

Also Read: Anil Ravipudi: వరసగా తొమ్మిదో విజయం.. ‘సంక్రాంతి’ మొనగాడు అనిల్ రావిపూడి!

ఈ సాహసోపేతమైన నిర్ణయంకు మద్దతు ఇచ్చిన షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు టాలీవుడ్ పరిశ్రమ తరఫున ప్రత్యేక అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. డిజిటల్ సబోటేజ్‌కు చోటు లేకుండా, నిజమైన ప్రేక్షకుల తీర్పే సినిమాలకు ప్రమాణమవ్వాలన్న బలమైన సందేశాన్ని ఇస్తోంది. తెలుగు సినీ పరిశ్రమ కాలానికి అనుగుణంగా మారుతూ.. సృజనాత్మకతను ప్రోత్సహించడమే కాకుండా బాధ్యతాయుతమైన డిజిటల్ పాలనను అమలు చేస్తోందని ఇది తెలియజేస్తోంది.

Exit mobile version