కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఏప్రిల్ 30న విడుదల కావాల్సిన ఏక్ మినీ కథ
చిత్రాన్ని వాయిదా వేసింది నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్. అయితే… ఇంకా పరిస్థితి అలానే ఉండటంతో ఇప్పుడు మనసు మార్చుకుని థియేట్రికల్ రిలీజ్ కు వెళ్ళకుండా… ఓటీటీలోనే ఈ మూవీని స్ట్రీమింగ్ చేయడానికి నిర్మాతలు సిద్ధపడ్డారు. మే 27న అమెజాన్ ప్రైమ్ లో ఏక్ మినీ కథ
ను స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. సంతోష్ శోభన్, కావ్యా థాపర్ జంటగా నటించిన ఈ సినిమాను యూవీ కాన్సెప్ట్స్ తో పాటు మ్యాంగో మాస్ మీడియా నిర్మించింది. ఇప్పటికే విడుదలైన మూవీ ఫస్ట్ లుక్, పాటలకు చక్కని స్పందన లభించిందని, రేపు ఓటీటీలోనూ అదే ఆదరణ లభిస్తుందనే నమ్మకం ఉందని నిర్మాతలు అంటున్నారు. మేర్లపాక గాంధీ కథను అందించిన ఈ సినిమాను కార్తీక్ రాపోలు దర్శకత్వంలో నిర్మించారు. ప్రవీణ్ లక్కరాజు స్వరాలు సమకూర్చగా రవీందర్ ప్రొడక్షన్ బాధ్యతలు నిర్వర్తించారు.