IBomma Piracy: ఐబొమ్మ కథ ముగిసిందనుకుంటే.. మళ్లీ మొదలైందా? బాంబ్ పేల్చిన రవి!

Ibomma Ravi Bail

Ibomma Ravi Bail

IBomma Piracy: టాలీవుడ్‌లో పైరసీ భూతం మరోసారి కలకలం రేపుతోంది. పైరసీ వెబ్‌సైట్లు అయిన ‘ఐబొమ్మ’ (iBomma), ‘బప్పం’ (Bappam) లపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇటీవల థియేటర్లలో విడుదలైన కొత్త సినిమాలను యథేచ్ఛగా ఈ సైట్లలో అప్‌లోడ్ చేస్తుండటంతో నిర్మాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫిల్మ్ ఛాంబర్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు ఈ రెండు వెబ్‌సైట్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు స్టార్ట్ చేసినట్లు తెలిపారు.

నాకు సంబంధం లేదు..
గతంలో ఒరిజినల్ ఐబొమ్మ వెబ్‌సైట్‌ను నిర్వహించినట్లు ప్రచారంలో ఉన్న రవి అనే వ్యక్తి ఈ వ్యవహారంపై తాజాగా స్పందించారు. ప్రస్తుతం నెట్‌లో అందుబాటులోకి వచ్చిన కొత్త ‘ఐబొమ్మ’ వెబ్‌సైట్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఎవరో కేటుగాళ్లు ఐబొమ్మ బ్రాండ్ నేమ్‌ను వాడుకుంటూ కొత్తగా వెబ్‌సైట్‌ను క్రియేట్ చేసి రన్ చేస్తున్నారని అన్నారు. ఇటీవల కాలంలో విడుదలైన పెద్ద, చిన్న సినిమాలన్నింటినీ ఈ కొత్త ఐబొమ్మ, బప్పం వెబ్‌సైట్లలో కేటుగాళ్లు అప్‌లోడ్ చేస్తున్నారు. గతంలో ఐబొమ్మకు ఉన్న పాపులారిటీని ఆసరాగా చేసుకుని, సినిమా లవర్స్‌ను టార్గెట్ చేస్తూ అదే పేరుతో కొత్త డొమైన్‌లను సృష్టిస్తున్నారు. ఓటీటీ, థియేటర్ కలెక్షన్లపై ఈ పైరసీ సైట్లు తీవ్ర ప్రభావం చూపుతుండటంతో ఫిల్మ్ ఛాంబర్ ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది.

ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు ఐబొమ్మ, బప్పం వెబ్‌సైట్ల నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. ఈ సైట్లను ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు? దీని వెనుక ఉన్న ముఠా ఎవరు? అనే కోణంలో ఐపీ అడ్రస్‌లు, డొమైన్ రిజిస్ట్రేషన్ల ఆధారంగా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. పైరసీ వెబ్‌సైట్లను బ్యాన్ చేయడంతో పాటు, వాటిని నడిపిస్తున్న నేరగాళ్లను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.