ఫిలిం ఫెడరేషన్లో భాగమైన తెలుగు సినిమా డ్రైవర్స్ యూనియన్ గత 13 రోజులుగా సమ్మె చేస్తోంది. ఈ పోరాటం ఇప్పుడు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. డ్రైవర్స్ యూనియన్ సభ్యులు తమ ఆవేదనను, సమస్యలను బహిరంగంగా వెల్లడిస్తూ, నిర్మాతలు తమను అన్యాయంగా చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఒక సింగిల్ కాల్‌షీట్‌కు డ్రైవర్‌కు 1195 రూపాయలు చెల్లిస్తున్నారు. ఒకటిన్నర కాల్‌షీట్‌కు 1800 రూపాయలు వస్తాయి. అయితే, మూడేళ్లకు ఒకసారి కేవలం 30 శాతం వేతనం పెంచితే, దానిలో 50 శాతం నష్టపోతున్నామని యూనియన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ వంటి మహానగరంలో జీవన వ్యయం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో, కనీసం 50 శాతం వేతనం పెంచాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారని గుర్తు చేశారు.
Also Read : Pooja: పాపం పూజా.. బ్యాడ్ లక్ వదలట్లేదే!
కొందరు నిర్మాతలు డ్రైవర్లను “దొంగలు”, “మాఫియా” అని వ్యాఖ్యానించడంపై యూనియన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, ఒకవేళ అలాంటి వ్యాఖ్యలు కొనసాగితే నిర్మాతల కార్యాలయాల ముందు ధర్నాకు దిగుతామని హెచ్చరించింది. “మేము మిమ్మల్ని దోచుకోవాలనుకుంటే 1100 రూపాయలకే పని చేయము,” అని యూనియన్ సభ్యులు స్పష్టం చేశారు. డ్రైవర్లు తమ పని బాధ్యతను నిర్వర్తిస్తున్నారని, ఏ సందర్భంలోనైనా డ్యూటీ ఒప్పుకుంటే పూర్తి బాధ్యతతో విధులు నిర్వహిస్తారని యూనియన్ సభ్యులు తెలిపారు. “మా గురించి, మా పని బాధ్యత గురించి నిర్మాతలకు బాగా తెలుసు. కానీ, మమ్మల్ని తక్కువ చేసేలా మాట్లాడుతున్నారు,” అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్ నిర్మాతలు ఈ విషయంలో నిశ్శబ్దంగా ఉండగా, కొత్తగా వచ్చిన కొందరు నిర్మాతలు మాత్రమే విమర్శలు చేస్తున్నారని యూనియన్ ఆరోపించింది.
Also Read : Pawan Kalyan: ‘సూపర్ స్టార్ రజినీ’ టైటిల్ కార్డ్ కనిపిస్తే థియేటర్ మారుమోగుతుంది!
డ్రైవర్ల జీవనం అంత సులభం కాదు. “ఎవరూ నిద్రలేవకముందే మేము వెళ్తాం, అందరూ పడుకున్నాక తిరిగి వస్తాం. కనీసం భార్య, పిల్లలను చూసేందుకు కూడా సమయం ఉండదు,” అని వారు వాపోయారు. ఇలాంటి కష్టతరమైన పరిస్థితుల్లో పనిచేస్తున్న డ్రైవర్లను అవమానించడం సరికాదని, వారి సమస్యలను అర్థం చేసుకోవాలని యూనియన్ కోరుతోంది. దాసరి నారాయణ రావు గారు ఏర్పాటు చేసిన ఈ యూనియన్‌ను విచ్ఛిన్నం చేయాలని కొందరు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారని యూనియన్ ఆరోపిస్తోంది. నిర్మాతలు తమ డిమాండ్లను తగ్గించేందుకు ఒత్తిడి తెస్తున్నారని యూనియన్ ఆవేదన వ్యక్తం చేసింది.
