గతేడాది కరోనా కారణంగా థియేటర్లు బంద్ అయ్యాయి. చిత్రపరిశ్రమకు భారీ నష్టం వాటిల్లింది. ఇప్పుడిపుడే కోలుకుంటోంది. అయితే కరోనా సెకండ్ వేవ్ మళ్ళీ కాటువేయబోతోందా? అంటే అవుననే వినిపిస్తోంది. ప్రభుత్వం బంద్ ప్రకటించకున్నా… థియేటర్లు స్వచ్ఛధంగా బంద్ పాటించే పరిస్థితి ఎదురుకాబోతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ‘వకీల్ సాబ్’ తప్ప వేరే ఏ సినిమా థియేటర్లలో కనిపించటం లేదు. అసలు కరోనా తర్వాత తెలుగు చిత్రపరిశ్రమ తప్ప వేరే ఏ భాషా సినిమాలకు అంత అశాజనకమైన స్థితి కనిపించలేదు. జనవరి నుంచి మన తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రమే పుంజుకుని వరుస విజయాలు చవిచూసింది. అటు బాలీవుడ్ లో కానీ మరే ఉడ్ లో కానీ తెలుగు చిత్రపరిశ్రమలోలా ఘన విజయాలు లేవు. దాంతో బడా సినిమాలు అన్నీ విడుదలను వాయిదా వేసుకున్నాయి. మరి కొన్ని వాయిదాలు పడుతున్నాయి. తెలుగు రాష్ర్టాలలో కూడా 16న విడుదల కావలసిన ‘లవ్ స్టోరీ’ని వాయిదా వేశారు. 23న రావలసిన ‘తలైవి’తో పాటు నానీ ‘టక్ జగదీష్’ కూడా పోస్ట్ పోన్ అనే మాట వినిపిస్తోంది. నెలాఖరులో రావలసిన ‘పాగల్, సిటీమార్’ పరిస్థితి ఏమిటనేది కూడా తెలియటం లేదు. ప్రస్తుతం థియేటర్లలో ఉన్న సినిమాల్లో ‘వకీల్ సాబ్’ మినహా ఏ సినిమాకు కరెంట్ ఖర్చులు కూడా రావటం లేదు. ‘వకీల్ సాబ్’ ఊపు కూడా తగ్గింది. సైడ్ థియేటర్లలో తీసి వేస్తున్నారు. అక్కడ ప్రదర్శించటానికి సినిమాలు లేవు. దీంతో చాలా మంది థియేటర్లను స్వచ్ఛందంగా మూసి వేయటానికే రెడీ అవుతున్నట్లు సమాచారం. కరోనా తర్వాత టాలీవుడ్ లో కొన్ని హిట్స్ పడగానే జబ్బలు చరుస్తూ అందరూ పారితోషికాలను పెంచేశారు. అవసరం కొద్దీ నిర్మాతలు గంగిరెద్దులా తలలూపారు. ఇప్పుడు పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. మరోసారి థియేటర్లు బంద్ అయితే సినిమాలన్నీ ఓటీటీవైపు చూడవలసిందే. గతంలో ఓటీటీవారు ఇమేజ్ ఉన్న వారి సినిమాలను మంచి రేటు ఇచ్చి కొని నష్టపోయారు. ఈ సారి మాత్రం పే ఫర్ వ్యూ టైప్ ని అమలులో పెడతారట. సో దర్శకనిర్మాతలు ఒళ్ళు దగ్గరపెట్టుకోవాల్సిందే… పెరుగుల విరుగట కొరకే అని ఊరికే అనలేదు… చూద్దాం థియేటర్ల మూసివేత ఎలాంటి స్థితికి దారి చూపుతుందో?