తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ ‘రాక్షసన్’ తమిళ తంబీలను మాత్రమే కాకుండా టాలీవుడ్ ఆడియన్స్ ను కూడా థ్రిల్ చేసింది. తమిళంలో విష్ణు విశాల్, అమలా పాల్ కీలక పాత్రలు పోషించిన ‘రాక్షసన్’ మూవీ అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ తరువాత తెలుగులో “రాక్షసుడు” అనే టైటిల్ తో విడుదలై భారీ రెస్పాన్స్ తో పాటు నిర్మాతలకు లాభాలనూ తెచ్చిపెట్టింది. తెలుగులో రమేశ్ వర్మ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా రీమేక్ చేశారు. అంతవరకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన సినెమాలన్నిటి కంటే ఈ సినిమానే మంచి లాభాలను తెచ్చిపెట్టింది. అంతేకాదు ఈ సినిమాలో బెల్లంకొండ హీరోలోని యాక్టింగ్ టాలెంట్ కు కూడా విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
Read Also : పండంటి బిడ్డకు జన్మనిచ్చిన “వండర్ వుమన్”
ఈ సినిమాను తెలుగులో నిర్మించిన నటుడు హనీశ్ దీని హిందీ రీమేక్ హక్కుల్ని సైతం తీసుకున్నారు. బాలీవుడ్ లో ఈ చిత్రాన్ని అక్షయ్ కుమార్ తో తీయాలని అనుకున్నారు. అయితే కరోనా కారణంగా హనీష్ “రాక్షసుడు” హిందీ రీమేక్ రైట్స్ ను అక్షయ్ కే ఇచ్చేశారట. తాజాగా “రాక్షసన్” మూవీ హిందీ రీమేక్ కు టైటిల్ ఖరారయ్యింది. అక్షయ్ కుమార్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ రీమేక్ కు “మిషన్ సిండ్రెల్లా” అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. మరి ఈ చిత్రం హిందీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.