కోలీవుడ్ స్టార్ సూర్య కథానాయకుడిగా తెరకెక్కిన తాజా ఫ్యామిలీ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘విశ్వనాథ్ & సన్స్’ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమాలో భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా థియేటర్లలో ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకుని, కంటతడి పెట్టించిన డ్రైవర్ ముత్తుస్వామి పాత్రకు సంబంధించిన ఎమోషనల్ సీన్ వెనుక ఉన్న అసలైన నిజాన్ని దర్శకుడు వెంకీ అట్లూరి తాజాగా వెల్లడించారు. ఈ సన్నివేశం కేవలం సినిమాటిక్ డ్రామా కోసం కల్పించింది కాదని, టాలీవుడ్ ప్రముఖులు నిర్మాత దిల్ రాజు, దర్శకుడు హరీష్ శంకర్ నిజ జీవితంలో చేసిన ఒక గొప్ప సహాయం ఆధారంగా రాసుకున్నదని వెంకీ అట్లూరి తెలిపారు.
“2012–2014 మధ్య కాలంలో జరిగిన ఒక వాస్తవ సంఘటన ఇది. సెట్స్‌లో పనిచేసే ఒక లైట్‌మ్యాన్ కొడుకు భవిష్యత్తు కోసం నిర్మాత దిల్ రాజు గారు, దర్శకుడు హరీష్ శంకర్ గారు ముందుకు వచ్చి ఎంతో ఉదారంగా సహాయం చేశారు. తెర వెనుక వారు చూపించిన ఆ మానవత్వం, గొప్ప మనసు నాపై ఎంతో బలమైన ముద్ర వేసింది. అందుకే ఆ స్పూర్తిదాయకమైన సంఘటనను వెండితెరపై ఎప్పటికీ నిలిచిపోయేలా ‘విశ్వనాథ్ & సన్స్’లో ముత్తుస్వామి సీన్ రూపంలో పొందుపరిచాను” అని వెంకీ అట్లూరి చెప్పుకొచ్చారు. నిజ జీవితంలో జరిగిన ఆ ఉదారమైన ఘటనను తెరపై అంతే సహజంగా, ఆర్ద్రతతో వెంకీ అట్లూరి ఆవిష్కరించిన తీరు ప్రస్తుతం సినీ ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ నిజం తెలిసిన తర్వాత ఆ సన్నివేశం చూసిన ప్రేక్షకుల్లో భావోద్వేగం మరింత రెట్టింపవుతోంది.

