Suriya: ‘హోంబాలే’తో చేతులు కలిపిన సూర్య.. డైరెక్టర్ ఎవరంటే?

Suriya

Suriya

Suriya: వైవిధ్యభరితమైన పాత్రలతో, వైబ్రెంట్ నటనతో సౌత్ ఇండియాలోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరో సూర్య. ఇప్పుడు ఈ స్టార్ హీరోకు సంబంధించిన నెక్ట్స్ చిత్రంపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. కేజీఎఫ్, కాంతార, సలార్ వంటి ఇండస్ట్రీ హిట్లను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ ‘హోంబాలే ఫిలిమ్స్’ ఈ భారీ క్రేజీ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించింది. ఇందుకు సంబంధించిన అఫీషియల్ పోస్టర్‌ను మేకర్స్ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు.

‘సూర్య x హోంబాలే’ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ‘జై భీమ్’ ఫేమ్ టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వం వహించనున్నారు. గతంలో సూర్య – జ్ఞానవేల్ కాంబినేషన్‌లో వచ్చిన ‘జై భీమ్’ చిత్రం ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. మరోసారి వీరిద్దరూ కలిసి ఒక పవర్‌ఫుల్, సామాజిక కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో సినిమాపై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో సూర్య సరసన హీరోయిన్ టాలెంటెడ్ బ్యూటీ కయాదు లోహార్ ఎంపికయ్యారు. “మూడు దశాబ్దాలుగా వెండితెరపై కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న సూర్యను మా గ్రాండెస్ట్ స్టేజ్‌పైకి సగర్వంగా ఆహ్వానిస్తున్నాం” అంటూ హోంబాలే ఫిలిమ్స్ రిలీజ్ చేసిన నోట్‌లో పేర్కొంది. విజయ్ కిరగందూర్, చలువే గౌడ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండగా, ఎస్.ఆర్. కదిర్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు, రెగ్యులర్ షూటింగ్ అప్‌డేట్స్ వెల్లడి కానున్నాయి.