కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ సూర్య (Suriya), ఎవర్ గ్రీన్ బ్యూటీ త్రిష (Trisha) లీడ్ రోల్స్‌లో నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ కోర్ట్ రూమ్ యాక్షన్ డ్రామా ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’). టాలెంటెడ్ డైరెక్టర్ ఆర్జే బాలాజీ (RJ Balaji) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 15న విడుదలై.. బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తూ సూర్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా రూ. 300 కోట్ల క్లబ్ వైపు దూసుకుపోతుండటంతో.. చిత్రబృందం గ్రాండ్‌గా సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ వేడుకలో సూర్య సినిమా విజయంపై సంతోషం వ్యక్తం చేయడంతో పాటు, అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘కరుప్పు’ సీక్వెల్ (Karuppu 2) పై ఒక అదిరిపోయే అఫీషియల్ హింట్ ఇచ్చారు.
సూర్య మాట్లాడుతూ.. ‘డైరెక్టర్ ఆర్జే బాలాజీ విజన్‌ను నేను పూర్తిగా నమ్మాను. ఆయన కథ చెప్పిన గంటలోపే ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను. ఈ సినిమా కోసం సైన్ చేసిన మొదటి రోజు నుంచే మాకు అంతా మంచే జరిగింది. ‘కరుప్పు’ కచ్చితంగా విజయం సాధిస్తుందని నాకు ముందే తెలుసు. కానీ, బాక్సాఫీస్ వద్ద ఈ స్థాయిలో మా అంచనాలకు మించి ఇంత భారీ ఘన విజయాన్ని అందుకోవడం నిజంగా చాలా అద్భుతంగా ఉంది” అని సూర్య తెలిపారు. కాగా ఈ సక్సెస్ మీట్‌లో మీడియా ప్రతినిధులు ‘కరుప్పు’ సీక్వెల్ (రెండో భాగం) గురించి ప్రశ్నించగా.. సూర్య తనదైన శైలిలో నవ్వుతూ సమాధానమిచ్చారు.. ‘ ‘కరుప్పు’ చిత్రానికి పార్ట్-2 రావాలని మీలాగే నేను కూడా అంతే ఆశతో, ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. దీనికి సంబంధించిన అప్‌డేట్స్ చాలా త్వరలోనే వెల్లడవుతాయని నమ్ముతున్నాను’ అని క్రేజీ కామెంట్స్ చేశారు. సూర్య స్వయంగా హింట్ ఇవ్వడంతో త్వరలోనే ‘కరుప్పు 2’ సెట్స్ పైకి వెళ్లడం ఖాయమని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు.
