Sunny Leone: ప్రముఖ బాలీవుడ్ నటి సన్నీలియోన్‌కు కర్ణాటక సీఐడీ (CID) అధికారులు గట్టి షాక్ ఇచ్చారు. ఒక భారీ ఆర్థిక కుంభకోణం కేసుకు సంబంధించి సన్నీలియోన్‌తో పాటు కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖ నటీనటులకు సీఐడీ నోటీసులు జారీ చేసేందుకు కర్ణాటక సీఐడీ రెడీ అవుతుంది. అక్రమ నగదు లావాదేవీల కేసులో ఈ నోటీసులు ఇవ్వడం సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. అసలు ఏం జరిగిందంటే.. బెళగావికి చెందిన ‘శివం అసోసియేట్స్’ అనే సంస్థ కస్టమర్ల నుంచి అక్రమంగా పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్లను వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఇదే సమయంలో ఈ సంస్థ ఓనర్ శివానంద నీలణ్ణవరపై ఆర్థిక మోసాల కేసు నమోదైంది. ఈ క్రమంలో గతేడాది డిసెంబరులో ఈ సంస్థ ఆధ్వర్యంలో అక్రమ సొమ్ముతో నిర్వహించిన ‘కన్నడ ఉత్సవం’పై సీఐడీ ఇప్పుడు దృష్టి సారించింది.
ఆర్థిక మోసాల కేసు నమోదైన శివం అసోసియేట్స్ యజమాని శివానంద నీలణ్ణవర 2023లో ‘ఛాంపియన్’ అనే సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలోని ఒక స్పెషల్ ఐటెం సాంగ్‌లో సన్నీ లియోన్ డాన్స్ చేసింది. ఈ ఒక్క పాట కోసం ఆమెకు రెమ్యూనరేషన్ కింద ఏకంగా రూ.1 కోటి చెల్లించినట్లు సీఐడీ అధికారులు రికార్డు పత్రాల ద్వారా గుర్తించారు. కస్టమర్లను ముంచిన అక్రమ సొమ్మునే సన్నీ లియోన్‌కు రెమ్యూనరేషన్‌గా ఇచ్చినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ స్పెషల్ సాంగ్ కోసం ఆమె తీసుకున్న లావాదేవీలపై పూర్తి వివరణ ఇవ్వాలంటూ తాజాగా కర్ణాటక సీఐడీ సన్నీ లియోన్‌కు నోటీసులు జారీ చేసింది.
లిస్ట్‌లో స్టార్ హీరోలు, హీరోయిన్లు వీరే..
కేవలం సన్నీలియోన్ మాత్రమే కాకుండా, శివం అసోసియేట్స్ నిర్వహించిన కన్నడ ఉత్సవంలో పాల్గొన్న స్టార్ నటీనటులకు కూడా సీఐడీ నోటీసులు ఇవ్వనుంది. ఈ లీస్ట్‌లో ప్రముఖ నటులు డాలి ధనుంజయ్, వశిష్ఠ సింహ, ‘కాంతార’ ఫేమ్ సప్తమీ గౌడ, రాగిణి ద్వివేది ఉన్నారు. వీరందరూ కూడా శివం అసోసియేట్స్ నిర్వహించిన కన్నడ ఉత్సవంలో పాల్గొన్న ప్రముఖులు. ఈ ఈవెంట్‌లో పాల్గొన్నందుకు వీరందరికీ సదరు సంస్థ భారీగా నగదు ముట్టజెప్పినట్లు సీఐడీ బలంగా అనుమానిస్తోంది. బాధితుల నుంచి వసూలు చేసిన డిపాజిట్లను ఈ నటీనటులకు భారీగా పంచిపెట్టారనే కోణంలో సీఐడీ విచారణను వేగవంతం చేసింది. త్వరలోనే ఈ స్టార్లందరినీ అధికారులు ముఖాముఖి విచారించనున్నట్లు తెలుస్తోంది.

