తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ కెరీర్‌లోని ప్రాజెక్ట్‌లకు సంబంధించి ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్ కుమార్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. 2022లో వచ్చిన ‘బీస్ట్’ చిత్రానికి ముందు విజయ్ కోలీవుడ్ దర్శకులు వెట్రిమారన్ అలాగే లేడీ డైరెక్టర్ సుధా కొంగర లతో సినిమాలు చేయాల్సి ఉందట.
జీవీ ప్రకాష్ మాట్లాడుతూ ‘ వాస్తవానికి విజయ్ మొదట వెట్రిమారన్, సుధా కొంగరతో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకున్నారు. అయితే కథా చర్చల సమయంలో సుధా కొంగర, వెట్రిమారన్ ఇద్దరూ పక్కా స్క్రిప్ట్ సిద్ధం చేయడానికి విజయ్‌ను దాదాపు ఏడాది సమయం అడిగారు. కానీ ఏడాది అంటే చాలా గ్యాప్ వస్తుందని భావించి ఆ ఇద్దరికీ నో చెప్పారు. దాంతో విజయ్ కేటాయించిన కాల్ షీట్స్ చివరకు నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బీస్ట్’ సినిమాకి వెళ్లాయి. అలా బెస్ట్ సెట్స్ పైకి ఎక్కింది. ఇక మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే విజయ్ కోసం సిద్ధం చేసిన ఆ కథనే దర్శకురాలు సుధా కొంగర ఆ తర్వాత టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుకి కూడా వినిపించారు. అయితే రకరకాల కారణాల వల్ల మహేశ్ బాబుతో కూడా ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేకపోయింది’ అని తెలిపారు.
ఆ స్క్రిప్ట్‌లు కనుక సరైన సమయానికి పట్టాలెక్కి ఉంటే, విజయ్, మహేశ్ బాబుల కెరీర్‌లో సరికొత్త కాంబినేషన్లను ప్రేక్షకులు చూసేవారని చెప్పడంలో సందేహం లేదు. మహేశ్ బాబు ఆ టైమ్ లోనే సుధా కొంగర సినిమాకు నో చెప్పి టాలీవుడ్ దర్శకుడు పరశురామ్ పెట్ల డైరెక్షన్ లో సర్కారువారిపాట సినిమా చేశారు.

