Mahesh Babu’s Varanasi Movie Update: దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘వారణాసి’. పాన్ వరల్డ్ స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీని కేఎల్ నారాయణ, ఎస్‌ఎస్ కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహేశ్ రుద్ర అనే పాత్రలో నటిస్తుండగా.. ప్రతినాయకుడు ‘కుంభ’గా పృథ్వీరాజ్ సుకుమారన్, ‘మందాకిని’గా ప్రియాంక చోప్రా కనిపించనున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న వారణాసి 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది.
వారణాసిపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా సినిమాలోని రామాయణ ఎపిసోడ్ ఎలా ఉండబోతుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఇదే సమయంలో ‘ది రామాయణం’ నుంచి ఏదైనా అప్‌డేట్ వచ్చిన ప్రతిసారీ.. ‘వారణాసి’లోని రామాయణ ఎపిసోడ్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు కూడా బయటకు వస్తుండటం విశేషం. తాజాగా జక్కన్న వారణాసిలో ఉండే రామాయణ పోర్షన్‌పై సర్‌ప్రైజింగ్ డీటెయిల్స్ వెల్లడించారు. సినిమాలో సుమారు 25 నిమిషాల పాటు సాగే రామాయణ ఎపిసోడ్ ఉంటుందని ఇప్పటికే ఆసక్తి నెలకొనగా.. ఈ మొత్తం భాగాన్ని ఒకే ఎపిసోడ్‌గా చూపించబోనని తెలిపారు.
రామాయణ పోర్షన్ ఒకేసారి కాకుండా సబ్ ఎపిసోడ్స్‌గా విభజించి కథలో భాగంగా చూపించనున్నట్లు ఎస్‌ఎస్ రాజమౌళి వెల్లడించారు. దీంతో ఈ రామాయణ ఘట్టాలను రాజమౌళి ఏ విధంగా కథలోకి తీసుకొస్తారు?, ఏ సందర్భాల్లో ఈ సబ్ ఎపిసోడ్స్ వస్తాయి? అనే ప్రశ్నలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే వారణాసిలో రామాయణానికి సంబంధించిన అంశాలు కీలకంగా ఉండబోతున్నాయనే ప్రచారం జరిగింది. ఇప్పుడు 25 నిమిషాల రామాయణ ఎపిసోడ్‌ను సబ్ ఎపిసోడ్స్‌గా చూపించనున్నట్లు రాజమౌళి చెప్పడంతో.. సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ముఖ్యంగా విజువల్ ట్రీట్‌కు పెట్టింది పేరైన రాజమౌళి ఈ భాగాన్ని ఎలా తెరకెక్కిస్తారో? చూడాలి.

