Srikanth Odela: ‘దసరా’ కేజీఎఫ్ కాదన్న నిరాశను తుడిచేయడానికే నానితో ‘ప్యారడైజ్’..

Srikanth Odela

Srikanth Odela

‘దసరా’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, తన తదుపరి చిత్రం ‘ది ప్యారడైజ్’తో మరోసారి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేందుకు సిద్ధమవుతున్నారు. అయితే తాజాగా జరిగిన మీడియా ముఖాముఖిలో ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.

‘దసరా’ సినిమా సమయంలో ప్రమోషన్ల ద్వారా వచ్చిన హైప్ వల్ల ప్రేక్షకులు కేజీఎఫ్ తరహా పూర్తి స్థాయి ఊచకోత సినిమా ఆశించి వచ్చారని, తీరా థియేటర్‌లో వెన్నెల ప్రేమకథ, డ్రామా చూసి మొదట్లో తీవ్ర నిరాశ చెందారని శ్రీకాంత్ కుండబద్దలు కొట్టారు. నానితో సినిమా బ్లాక్‌బస్టర్ అయినా కూడా ప్రేక్షకులు ఊహించిన ఆ మాస్ సంతృప్తిని పూర్తిగా ఇవ్వలేకపోయామన్న చిన్న లోటు మిగిలిందని, అందుకే నానితో కలిసి మళ్లీ ‘ప్యారడైజ్’ మొదలుపెట్టానని వెల్లడించారు.

ఈ చిత్రంలో నాని క్యారెక్టర్‌ను మునుపెన్నడూ చూడని విధంగా రెండు జడల గెటప్‌లో డిజైన్ చేశారు. తన చిన్నతనంలో అమ్మ తనకి జడలు వేసిన జ్ఞాపకం నుంచే ఈ కాన్సెప్ట్ పుట్టిందని, ఆదిలాబాద్ నేపథ్యంలోని కొన్ని యదార్థ సంఘటనల స్ఫూర్తితో గోదావరిఖని కల్చర్‌ను జోడించి ఈ కథ రాసుకున్నానని పేర్కొన్నారు. ఈ చిత్రంలో మోహన్ బాబు ప్రధాన విలన్‌గా కీలక పాత్ర పోషిస్తుండగా, అనిరుధ్ సంగీతం అందిస్తున్నారని, కథ పరంగా ఎటువంటి రీషూట్స్ చేయలేదని ఆయన స్పష్టం చేశారు.