Rangasthalam Locket: టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ‘రంగస్థలం’ సినిమాలో రామ్ చరణ్ గెటప్, ఆయన పండించిన ఎమోషన్స్ ప్రేక్షకులను ఏ స్థాయిలో కట్టిపడేశాయో అందరికీ తెలిసిందే. అయితే ఆ సినిమాలో చిట్టిబాబు మెడలో కనిపించే ఆంజనేయస్వామి లాకెట్ వెనుక ఒక అరుదైన, ఎవరికీ తెలియని సెంటిమెంట్ దాగుంది. మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా తయారు చేయించిన ఆ అమూల్యమైన లాకెట్‌ను మెగా పవర్ స్టార్ ఎవరికి కానుకగా ఇచ్చారో తెలుసా? ఆ లాకెట్ కథేంటి? అనే ఆసక్తికర నిజాన్ని ప్యారడైజ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తాజా రాఘవ్ జుయల్ ఇంటర్వ్యూలో బయటపెట్టారు.
శ్రీకాంత్ ఓదెల మెడలో ఎప్పుడూ ఉండే రుద్రాక్ష, హనుమాన్ లాకెట్ల గురించి నటుడు రాఘవ్ జుయల్ ప్రస్తావించగా.. ఆ లాకెట్ వెనుక ఉన్న సీక్రెట్‌ను శ్రీకాంత్ వివరించారు. “ఈ లాకెట్ చాలా ప్రత్యేకం. స్వయంగా చిరంజీవి గారు చెన్నై వెళ్లి ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి కేవలం రెండే రెండు పీసులు తయారు చేయించారు. అందులో ఒకటి చిరంజీవి గారి దగ్గర ఉంటే, రెండోది ‘రంగస్థలం’ సినిమాలో చరణ్ అన్న ధరించారు” అని వెల్లడించారు. ‘రంగస్థలం’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా, కాస్ట్యూమ్స్ ఇన్‌చార్జ్‌గా పనిచేసిన సమయంలో జరిగిన సంఘటనలను శ్రీకాంత్ గుర్తుచేసుకున్నారు. “సినిమా కోసం కాస్ట్యూమ్స్ విషయంలో చరణ్ అన్న టీమ్‌ను తీవ్రంగా టార్చర్ పెట్టేవాడిని. తెల్లవారుజామున 3:30, 4 గంటలకే నిద్రలేపి ఆ కాస్ట్యూమ్ ఏది? ఈ లుక్ సరిగ్గా ఉందా? అంటూ పరుగులు పెట్టించాను. షూటింగ్ లాస్ట్ డే చరణ్ అన్న నన్ను కారవాన్‌లోకి పిలిచారు. నార్మల్‌గా ఆయన ఎవరినీ అనవసరంగా పిలవరు. నేను కారవాన్‌లోకి వెళ్లగానే.. ఎలాంటి ప్రశ్న లేకుండా, ఏమీ మాట్లాడకుండా ఆ లాకెట్‌ను తీసి నా చేతిలో పెట్టారు. ‘శ్రీకాంత్.. ఇది నీ దగ్గరే ఉంచుకో’ అని చెప్పారు” అంటూ ఆ క్షణాన్ని గుర్తుచేసుకున్నారు.
ఆ టైంలో చరణ్ అన్నను ఎందుకు ఇస్తున్నారని ఒక్క ప్రశ్న కూడా అడగలేదని, ఎంతో భావోద్వేగంతో తీసుకున్న ఆ లాకెట్‌ను ఇప్పటి వరకు తన మెడలోంచి తీయలేదని శ్రీకాంత్ తెలిపారు. ఇటీవల రామ్ చరణ్‌ను కలిసినప్పుడు “అన్నా.. ఈ లాకెట్ గుర్తుందా?” అని అడగ్గా, చరణ్ ఒక్కక్షణం ఆలోచించి ఆ కథను గుర్తుచేసుకున్నారని, “అవును కదా.. నేనే నీకు ఇచ్చాను” అంటూ ఆనందం వ్యక్తం చేశారని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు. సుకుమార్ శిష్యుడిగా ఇండస్ట్రీకి వచ్చి, రామ్ చరణ్ చేతుల మీదుగా అంతటి పవిత్రమైన బహుమతిని పొందిన శ్రీకాంత్ ఓదెల.. నేడు స్టార్ డైరెక్టర్‌గా మారి నానితో ‘ది ప్యారడైజ్’ వంటి భారీ పాన్-ఇండియా సినిమాను తెరకెక్కిస్తుండటం విశేషం.

