Sree Vishnu: కంఫర్ట్ జోన్ దాటిన యంగ్ హీరో.. కెరీర్‌కు మరో టర్నింగ్ పాయింట్ అవుతుందా?

Sree Vishnu’s Mrithyunjay Ott

Sree Vishnu’s Mrithyunjay Ott

Sree Vishnu: వరుసగా నవ్వులు పంచే ఫ్యామిలీ డ్రామాలు, కామెడీ ఎంటర్‌టైనర్లతో తనకంటూ పక్కా మార్కెట్ సెట్ చేసుకున్న యంగ్ హీరో శ్రీవిష్ణు.. ఎట్టకేలకు తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తున్నారు. ఎప్పుడూ సేఫ్ గేమ్‌కే ప్రాధాన్యం ఇవ్వకుండా, ఈసారి ఏకంగా మైథాలజీ కథతో బిగ్ రిస్క్ తీసుకోబోతున్నారనే వార్తలు టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. ఇది ఆయన కెరీర్‌కు మరో బలమైన టర్నింగ్ పాయింట్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

‘రంగబలి’తో దర్శకుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న పవన్ బాసంశెట్టి ఈ సరికొత్త మైథాలజీ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇండియన్ సినిమాలో మైథాలజీ ట్రెండ్ నడుస్తుండటంతో, మన సంస్కృతి, పౌరాణిక అంశాలకు ఆధునిక నేటివిటీని జోడించి ఈ స్క్రిప్ట్ డిజైన్ చేశారట. శ్రీవిష్ణు నటనలోని కొత్త కోణాన్ని బయటకు తీసేలా ఆయన పాత్రను తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ఎస్ఎల్వీ సినిమాస్ అధినేత, ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి భారీ ఖర్చుతో తెరకెక్కించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఇప్పటికే కథా చర్చలు, ప్రీ-ప్రొడక్షన్ పనులు చకచకా సాగుతున్నాయని టాక్.

అయితే ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లడానికి కాస్త సమయం పట్టేలా కనిపిస్తుంది. ప్రస్తుతం శ్రీవిష్ణు ‘సామజవరగమన’ డైరెక్టర్ రామ్ అబ్బరాజుతో కలిసి ‘ఫ్యామిలీ ప్యాక్’ సినిమా చేస్తున్నారు. దీనిని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తేవాలని చూస్తున్నారు. అటు దర్శకుడు పవన్ బాసంశెట్టి కూడా సత్య, యోగిబాబులతో చేస్తున్న ‘గోల్డెన్ భాగ్యం’ ప్రాజెక్ట్ ముగించే పనిలో ఉన్నారు. ఈ రెండు పూర్తయ్యాకే మైథలాజికల్ మూవీ పట్టాలెక్కనుంది. కామెడీ ఇమేజ్‌ను పక్కనపెట్టి శ్రీవిష్ణు చేయబోయే ఈ సరికొత్త ప్రయోగం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో అధికారిక ప్రకటన వచ్చాకే మరింత క్లారిటీ రానుంది.