జనాన్ని నవ్వించడానికి అన్నట్టు వింతవింత పోకడలను ఆశ్రయించిన దర్శకరచయితలు ఎందరో ఉన్నారు. ఇ.వి.వి. సత్యనారాయణ మరికాస్త ‘అతి’గా ఆలోచించి ఆడాళ్ళు మగాళ్ళలాగా, మగవాళ్ళు ఆడవారిలాగా ప్రవర్తించే కథతో ‘జంబలకిడిపంబ’ చిత్రాన్ని తెరకెక్కించారు. చిత్రమేంటో కానీ విచిత్రంగా ఈ చిత్రం ప్రేక్షకులను భలేగా ఆకట్టుకొని భళారే అనిపించుకుంది. 1992 జూలై 3న జనం ముందు నిలచిన ‘జంబలకిడిపంబ’ విశేషాదరణ చూరగొంది.
కథ విషయానికి వస్తే – కన్నతల్లి, స్నేహితురాలు, పక్కింటి అక్కయ్య, ఎదురింటి ఆవిడ- ఇలా అందరూ భర్తల దౌర్జన్యానికి బలైపోతూ ఉండడం చూసి రామలక్ష్మి రగిలిపోతూ ఉంటుంది. ఆమెను వెదుక్కుంటూ ఓ కాగితం వస్తూ ఉంటుంది. కానీ, లెక్క చేయదు. చివరకు ఆమె లెక్క చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అది చదివి అందులో ఉన్న ఓ స్త్రీని ఆమె కలుసుకుంటుంది. ఎన్నో ఏళ్ళ పరిశోధన తరువాత తాను మగాళ్ళకు బుద్ధి చెప్పే ఓ ఔషధం కనుగొన్నానని, దానిని తీసుకు వెళ్ళి అందరూ తాగే నీటిలో కలపమంటుంది. రామలక్ష్మి అలాగే చేస్తుంది. దాంతో వైజాగ్ లోని మగాళ్లందరూ ఆడవారిలాగా, ఆడాళ్ళు మగాళ్లలాగా ప్రవర్తిస్తూ ఉండడం మొదలవుతుంది. అంతేకాదు, ఆ సమయంలో ఆ నీరు తాగిన వేరే ఊళ్ళవారు సైతం విపరీతంగా ప్రవర్తిస్తూ ఉంటారు. దీనిపై రాష్ట్ర హోమ్ మంత్రి మండిపడి, వైజాగ్ ను నిషిద్ధ నగరంగా ప్రకటించి, ఆ గొడవలోని అసలు రహస్యాన్ని తెలుసుకోమంటాడు. దాంతో విజయ్ అనే పోలీస్ ఇన్ స్పెక్టర్ ఆ రహస్యం ఛేదించడానికి వెళతాడు. అక్కడ మగాళ్ళ వింత ప్రవర్తన చూసి తికమక పడతాడు. చివరకు అతని అన్నయ్య సైతం అలాగే ప్రవర్తిస్తూ ఉండడం చూసి కంగు తింటాడు. విజయ్ కి ఏమీ తెలియదని రామలక్ష్మికి తెలిసి పోతుంది.
రామలక్ష్మి మాటలను బట్టి ఏదో జరిగిందని అర్థం చేసుకున్న విజయ్ ఆమెను ప్రేమిస్తు నటిస్తాడు. తరువాత తానూ తన అన్నయ్యలాగే మారిపోయినట్టు రామలక్ష్మిని భ్రమింప చేస్తాడు. వారిద్దరి పెళ్ళి జరుగుతుంది. అప్పుడు జంబలకిడిపంబ రహస్యం చెప్పమని విజయ్, రామలక్ష్మిని బెదిరిస్తాడు. ఆమె చెప్పదు. దాంతో ఓ నాటకం ఆడి ఆమె నోట అసలు రహస్యం కక్కిస్తాడు. జంబలకిడి పంబ ఇచ్చిన యోగిని దగ్గరకు పోతారు విజయ్, అతని అసిస్టెంట్. ఆమె చనిపోయిందని శిష్యుడి ద్వారా తెలుస్తుంది. అప్పుడే మరో విషయం కూడా చెబుతాడు ఆ యోగి . ‘జంబలకిడిపంబ’లో ‘పంబలకిడిజంబ’ కలవడంతో జనం విపరీతంగా మారతారని అంటాడు. అయిదు దశల్లో దాని ఫలితాలు విపరీతంగా ఉంటాయని లేకపోతే, జనం పిచ్చెక్కి చస్తారని చెబుతాడు. ‘పంబజంబఅంబలకిడి’ అనే విరుగుడు మందు ఇస్తానని దానిని తెస్తూ ఉండగా, ఓ దొంగలరాణి అతణ్ణి కిడ్నాప్ చేస్తుంది. ఆమెకు రామలక్ష్మి సహకరిస్తుంది. విజయ్ ఆమెను అడ్డగిస్తాడు. అప్పటికే అందరూ చిన్నపిల్లలలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. అది చూసి రామలక్ష్మికి తాను ఎంత తప్పు చేశానో తెలుస్తుంది. చివరకు పలు పాట్లు పడి ఆ విరుగుడు మందు నీళ్ళలో కలిపి, అందరి చేత తాగిస్తారు. దాంతో విచిత్రాలు పోయి, అందరూ యథాస్థితికి చేరుకోవడంతో కథ ముగుస్తుంది.
నరేశ్, ఆమని, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, బాబూమోహన్, మల్లికార్జునరావు, మహర్షి రాఘవ, ఐరన్ లెగ్ శాస్త్రి, ఆలీ, జయప్రకాశ్ రెడ్డి, డబ్బింగ్ జానకి, జయలలిత, ఆలపాటి విజయలక్ష్మి, కల్పనారాయ్, శ్రీలక్ష్మి, ఆదిత్య తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇ.వి.వి. సత్యనారాయణ సమకూర్చారు. దివాకర్ బాబు రచన చేశారు. ఆచంట గోపీనాథ్ నిర్మాణ సారథ్యంలో డి.వి.వి.దానయ్య, జె.భగవాన్, సరస్వతీకుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి రాజ్-కోటి సంగీతం సమకూర్చారు. భువనచంద్ర పాటలు పలికించారు. ఇందులోని “కనరా వినరా… జంబలకిడిపంబ…”, “మదనా తగునా…”,”నేనే సూపర్ మేన్…”, “యమ్మా యమ్మా…” అంటూ సాగే పాటలతో పాటు పేరడీలతో సాగిన “నిలువరా వాలుకనులవాడా…” పాట కూడా జనాన్ని అలరించాయి.
‘జంబలకిడిపంబ’ చిత్రం మంచి విజయం సాధించింది. నిర్మాతలకు లాభాలు సంపాదించి పెట్టింది.