Sivakarthikeyan: ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, స్వయంకృషితో స్టార్ హీరోగా ఎదిగిన శివకార్తికేయన్.. తన కెరీర్ స్టార్టింగ్‌లో ఎదుర్కొన్న తీవ్ర అవమానాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ‘రేపు నువ్వు అసలు ఇండస్ట్రీలోనే ఉండవు’ అంటూ తన ముఖం మీదే అవహేళన చేసిన ఓ నిర్మాత మాటలకు, కాలమే సరైన బదులిచ్చిందని ఆయన చాటిచెప్పిన తీరు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా జరిగిన ‘శివకార్తికేయన్ నర్పణి ఇయక్కం’ వేదికగా అభిమానుల సమక్షంలో మాట్లాడిన ఆయన.. తన కెరీర్ తొలినాళ్ల నాటి సంఘటనను పంచుకున్నారు. “నేను సినిమాల్లోకి వచ్చి కొన్ని చిత్రాలు చేస్తున్న రోజుల్లో ఒక షూటింగ్ లొకేషన్‌కు కొంతమంది అభిమానులు నన్ను చూసేందుకు వచ్చారు. అక్కడే ఉన్న ఓ నిర్మాత ‘వీళ్లంతా ఎవరు?’ అని నన్ను అడిగారు. ‘నా అభిమానులు సార్’ అని నేను చెప్పగానే.. ‘ఓహో వీళ్లా.. ఇలాంటి వాళ్లు తాత్కాలిక క్రేజ్‌తో వస్తారు, మళ్లీ వెళ్లిపోతారు’ అంటూ తీసిపారేశారు. అందుకు నేను రియాక్ట్ అవుతూ.. ‘వారు ఎప్పటికీ నాతోనే ఉంటారు’ అని నమ్మకంగా చెప్పాను. దాంతో ఆ నిర్మాతకు కోపం వచ్చి ‘అభిమానులు ఉంటారు సరే.. అసలు నువ్వు పరిశ్రమలో ఉంటావా?’ అంటూ హేళనగా ప్రశ్నించారు” అని ఆనాటి చేదు జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నారు.
ఆనాడు తన టాలెంట్‌ను, అభిమానుల ప్రేమను తక్కువ చేసి మాట్లాడిన నిర్మాత మాటలను శివకార్తికేయన్ గుండెల్లో దాచుకుని కష్టపడ్డారు తప్ప ఎక్కడా వెనకడుగు వేయలేదు. కాలం గడిచింది.. నేడు ఆయన వెనుక వేల సంఖ్యలో ప్రేమతో నిలబడే సైన్యం తయారైంది. శివకార్తికేయన్ సంక్షేమ సంఘం కార్యక్రమానికి ఏకంగా రెండు వేల మందికి పైగా అభిమానులు తరలివచ్చి జేజేలు పలకడమే ఆ నిర్మాత ప్రశ్నకు తిరుగులేని సమాధానంగా నిలిచింది. నాడు ఉనికినే ప్రశ్నించిన చోట, నేడు తిరుగులేని స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుని ఎదిగిన శివకార్తికేయన్ ప్రయాణం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. “నువ్వు ఉండవు” అన్న వాళ్ల ముందే శిఖరమంత ఎత్తుకు ఎదిగి చూపించవచ్చని ఆయన నిరూపించారు. అభిమానుల బలమే తనను ఈ స్థాయికి చేర్చిందని శివకార్తికేయన్ గర్వంగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

