Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!

Sivakarthikeyan

Sivakarthikeyan

Sivakarthikeyan: తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ తన ఫ్యాన్స్‌కి ఇచ్చిన ఒక విలువైన సలహా ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా స్టార్ హీరోలు ఫ్యాన్ మీట్స్‌లో సినిమాల గురించో, బాక్సాఫీస్ రికార్డుల గురించో మాట్లాడటం చూస్తుంటాం. కానీ శివకార్తికేయన్ మాత్రం నేటి యువత ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యపై స్పందిస్తూ, తన సొంత జీవిత అనుభవాన్ని పంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. సోషల్ మీడియాలో మితిమీరిన ట్రోల్స్, నెగెటివిటీ, అనవసరమైన దృష్టి మళ్లింపుల వల్ల విలువైన టైం, మానసిక ప్రశాంతత కోల్పోతున్నామని ఆయన గుర్తుచేశారు. ఈ విషతుల్యమైన వాతావరణం నుంచి బయటపడేందుకు తాను అనుసరిస్తున్న సులువైన మార్గాన్ని ఫ్యాన్స్ ముందుంచారు.

“గత ఏడాది కాలంగా నేను క్రమం తప్పకుండా పుస్తకాలు చదవడం ప్రారంభించాను. సోషల్ మీడియాలో ఉండే నెగెటివిటీ, డిస్ట్రాక్షన్స్‌ నుంచి దూరంగా ఉండేందుకు బుక్ రీడింగ్ నాకు ఎంతో మేలు చేసింది. పుస్తకం చేతిలో ఉంటే మనసుకు ఎంతో పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. నా జీవితంలో మార్పు తెచ్చిన ఈ మంచి అలవాటును మీరూ అలవర్చుకోవాలని కోరుతున్నా. మీ ఇష్టానుసారం ఏ అంశంపై రాసిన పుస్తకమైనా సరే.. రోజుకు కనీసం పది నిమిషాల పాటు చదవండి” అని శివకార్తికేయన్ అభిమానులకు పిలుపునిచ్చారు. సినిమా గ్లామర్‌కు అతీతంగా, రోజువారీ జీవితంలో యువత మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని శివకార్తికేయన్ చేసిన ఈ విజ్ఞప్తి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. గంటల తరబడి రీల్స్ చూస్తూ కాలాన్ని వృధా చేసుకునే కల్చర్‌కు బదులు, రోజుకు కనీసం పది నిమిషాల పాటు అక్షరాలతో ప్రయాణం చేయాలన్న ఆయన మాటలు సోషల్ మీడియాలో సరికొత్త చర్చకు దారితీశాయి. ఒక స్టార్ హీరోగా సమాజానికి ఉపయోగపడే మెసేజ్ ఇచ్చారంటూ ఫ్యాన్స్‌తో పాటు సాధారణ నెటిజన్లు కూడా శివకార్తికేయన్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.