Shruti Haasan: ఆ బంధంలో బందీగా ఉండలేను.. పెళ్లి కాకుండానే తల్లిని అవుతా!

Shruti Haasan

Shruti Haasan

Shruti Haasan: సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరోయిన్ శ్రుతి హాసన్. ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడటానికి ఇష్టపడే బ్యూటీ తాజాగా తన పర్సనల్ లైఫ్ గురించి ఓ పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న విషయాలు ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటివరకూ ఎవరికీ తెలియని తన పెళ్లి సీక్రెట్‌ను బయటపెడుతూ ఆమె చేసిన కామెంట్స్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. తన వైవాహిక జీవితంపై వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ శ్రుతి హాసన్ ఒక సంచలన నిజాన్ని వెల్లడించారు. తాను పెళ్లికి పూర్తిగా వ్యతిరేకం కాదని చెబుతూనే, గతంలో ఒకసారి తాను పెళ్లి పీటల దాకా వెళ్లి చివరి నిమిషంలో ఆ బంధం నుంచి వెనక్కి వచ్చేశానని వెల్లడించారు. రెండు మనసుల కలయికగా ఉండాల్సిన బంధం, తన స్వేచ్ఛను హరించేలా ఉండకూడదన్నది ఆమె అభిప్రాయం. సొంత ఆలోచనలు, వ్యక్తిత్వానికే తొలి ప్రాధాన్యం ఇచ్చే శ్రుతి, వివాహం పేరుతో బందీగా మారడం తనకు ఏమాత్రం ఇష్టం లేదని ఈ పాడ్‌కాస్ట్‌లో స్పష్టం చేశారు.

నేటి సమాజంలో పెళ్లిళ్ల పేరిట జరుగుతున్న విచ్చలవిడి ఖర్చులపై కూడా ఆమె సూటిగా స్పందించారు. వివాహాన్ని ఒక గొప్ప వేడుకలా చేసుకునే వారిని తాను తప్పుపట్టనప్పటికీ, కేవలం ఆడంబరాల కోసమే కోట్లాది రూపాయలు ఖర్చు చేయడంలో అర్థం లేదన్నారు. ఒక్క రోజు సంబరం కోసం పెట్టే ఆ ఖర్చును సమాజంలో ఆకలితో, ఇబ్బందుల్లో ఉన్నవారికి దానం చేస్తే ఎంతో మేలు జరుగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. వివాహాన్ని ఒక స్టేటస్ సింబల్‌గా మార్చి ధనాన్ని వృధా చేస్తున్న తీరు చూస్తే బాధ కలుగుతుందని శ్రుతి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పిల్లల గురించి మాట్లాడుతూ మరో ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. తనకు అమ్మగా మారాలని, ఆ మాతృత్వపు అనుభూతిని పొందాలని బలంగా ఉందని చెప్పారు. అయితే దీనికోసం వివాహం చేసుకోవాల్సిన అవసరం లేదని, భవిష్యత్తులో ఒక బిడ్డను దత్తత తీసుకుని పెంచుకోవాలనే ఆలోచన ఉందని తన మనసులోని కోరికను బయటపెట్టారు. శ్రుతి హాసన్ ఫస్ట్ నుంచీ స్వతంత్ర భావాలు కలిగిన వ్యక్తి. గతంలోనూ ఆమె తన వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ, సమాజంలో తనకంటూ ఒక పేరు తెచ్చుకోవడానికి జీవితాంతం ఎంతో శ్రమించానని, అటువంటి గుర్తింపును కేవలం పెళ్లి అనే ఒక బంధంతో ముడిపెట్టడం ఊహించుకుంటేనే భయమేస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం శ్రుతి హాసన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.