యంగ్ హీరో శర్వానంద్, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ‘నారీ నారీ నడుమ మురారి’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన విజయోత్సవ సభలో శర్వానంద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు కెరీర్‌లో గొప్ప విజయాన్ని అందించిన నిర్మాత అనిల్ సుంకరపై తన కృతజ్ఞతను చాటుకున్నారు. ‘విజయం విలువ నాకు తెలుసు, అందుకే అనిల్ సుంకరతో చేయబోయే తదుపరి సినిమాకు నేను రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోను’ అని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. హీరో, నిర్మాత కలిసి కష్టపడితే అద్భుతమైన ఫలితాలు వస్తాయని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.
Also Read : Lockdown : ఎట్టకేలకు అనుపమ ‘లాక్‌డౌన్’ ముహూర్తం ఫిక్స్..
మరోవైపు, ఈ సినిమాలో చిన్న పాత్రలో మెరిసిన హీరో శ్రీవిష్ణుపై శర్వానంద్ ప్రశంసలు కురిపించారు. అలాగే కేవలం స్నేహం కోసం, కథపై ఉన్న నమ్మకంతో శ్రీవిష్ణు ఈ పాత్ర చేయడం గొప్ప విషయమని కొనియాడారు. భవిష్యత్తులో తమ ఇద్దరికీ సరిపడే మంచి కథ దొరికితే, అనిల్ సుంకర నిర్మాణంలోనే పూర్తిస్థాయి మల్టీస్టారర్ సినిమా చేస్తామని శర్వా క్లారిటీ ఇచ్చారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుకలో దర్శకులు త్రినాథరావు నక్కిన, వశిష్ట తదితరులు పాల్గొని చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.
