Bhogi Release: సాఫ్ట్, ఫ్యామిలీ కథలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్, ఈసారి రూటు మార్చి ఊరమాస్ యాక్షన్‌తో బాక్సాఫీస్‌పై దండయాత్రకు సిద్ధమయ్యారు. మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు సంపత్ నంది డైరెక్షన్‌లో శర్వా నటిస్తున్న ‘భోగి’ రిలీజ్ డేట్‌పై చిత్రయూనిట్ తాజాగా క్లారిటీ ఇచ్చింది. అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ హై-వోల్టేజ్ ఎంటర్‌టైనర్‌ను నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ మేకర్స్ వదిలిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేక్షకులకు ఊపిరి బిగబట్టే యాక్షన్ సీన్లతో పాటు, గుండెను హత్తుకునే ఎమోషనల్ టచ్ కూడా ఇందులో ఉంటుందని చిత్రబృందం చెబుతోంది. ముఖ్యంగా ఈ సినిమాను “శర్వా – సంపత్ బ్లడ్ ఫెస్ట్” అంటూ అభివర్ణించడంతో, థియేటర్లలో రక్తపాతం ఏ స్థాయిలో ఉండబోతోందోనని ఫ్యాన్స్ తెగ చర్చించుకుంటున్నారు. సంపత్ నంది మార్క్ టేకింగ్‌లో శర్వానంద్ మాస్ అవతారం చూడటానికి సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
శర్వానంద్ కెరీర్‌లో 38వ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో ఆయన సరసన అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ యాక్టర్ రోహిత్ పాఠక్ ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత కె.కె. రాధామోహన్ ఎక్కడా రాజీ పడకుండా భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మాస్ సినిమాకు భీమ్స్ సిసిరోలియో అందిస్తున్న మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మేజర్ అసెట్ కానున్నాయి. స్టంట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ ఫైట్స్, కిషోర్ కుమార్ సినిమాటోగ్రఫీ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చనున్నాయి. మొత్తానికి నవంబర్ 27న శర్వానంద్, సంపత్ నంది కలిసి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విధ్వంసం సృష్టిస్తారో చూడాలి.

