ఇండస్ట్రీకి వచ్చిన 33 ఏళ్లకు తొలిసారిగా నేషనల్ అవార్డును సొంతం చేసుకున్నారు బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్. అట్లీ దర్శకత్వం వహించిన ‘జవాన్’ సినిమాకు గానూ ఆయన జాతీయ ఉత్తమ నటుడు పురస్కారాన్ని దక్కింది. దీంతో ఆయనకు నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన భార్య గౌరీఖాన్ కూడా ఇటీవల ప్రకటించిన నేషనల్ అవార్డుల విజేతలకు అభినందనలు తెలుపుతూ తాజాగా పోస్ట్ పెట్టారు. దీన్ని షేర్ చేసిన షారుక్.. ఓ ఫన్నీ క్యాప్షన్ పెట్టారు.
Also Read : Ajith : 33 ఏళ్ల తన సినీ ప్రయాణంపై.. అజిత్ ఎమోషనల్ పోస్ట్
జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న వారిలో తనకెంతో ఇష్టమైన వారు కూడా ఉన్నారని గౌరీ తెలిపారు. షారుక్, రాణీ ముఖర్జీ, కరణ్ జోహార్‌లను అభినందిస్తూ వారితో దిగిన ఫొటోలను పంచుకున్నారు. వారి విజయం చూసి గర్వంగా ఉందని గౌరీ పేర్కొన్నారు. ఈ పోస్ట్ షేర్ చేసిన షారుక్.. ‘రాత్రి డిన్నర్ చేసే సమయంలో నా గురించి కూడా గొప్పగా చెప్పవా.. అలాగే నా సినిమాకు నిర్మాతగా వ్యవహరించినందుకు థాంక్యూ’ అని క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఇది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక షారుక్‌కు విషెస్ చెబుతూ కుమార్తె సుహానా కూడా పోస్ట్ పెట్టారు. దీనికి ఈ బాలీవుడ్ బాద్‌షా స్పందిస్తూ.. ‘‘నేను నిద్రలో కూడా నిన్ను అలరించాలని కోరుకుంటున్నా’’ అంటూ కుమార్తెకు రిప్లై ఇచ్చారు.