‘బట్టలరామస్వామి బయోపిక్’, ‘కాఫీ విత్ ఏ కిల్లర్’, ‘సోలోబాయ్’ వంటి చిత్రాలను సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించిన సెవెన్ హిల్స్ సతీష్, తన పుట్టినరోజు (అక్టోబర్ 23) సందర్భంగా ఓ కీలక ప్రకటన చేశారు. నిర్మాతగా మూడు విజయవంతమైన చిత్రాలను అందించిన ఆయన, త్వరలో దర్శకుడిగా మారబోతున్నట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇదే రోజు ప్రభాస్ పుట్టినరోజు కావడం తనకు మరింత ఆనందంగా ఉందని ఆయన అన్నారు. “దర్శకుడు కావాలనే లక్ష్యంతోనే ఇండస్ట్రీకి వచ్చాను. నిర్మాతగా మూడు సినిమాలు చేసి, సినిమా నిర్మాణంలోని అన్ని విభాగాలపై పట్టు సాధించాను. ఇప్పుడు నా అసలు లక్ష్యం వైపు అడుగులేస్తున్నా,” అని సతీష్ తెలిపారు. ‘సోలోబాయ్’ సినిమా ఈవెంట్‌లో తన గురువు వివి వినాయక్ గారు ‘వయసులో ఉన్నప్పుడే డైరెక్షన్ చేయాలి’ అని చెప్పిన మాటలే తనకు స్ఫూర్తి అని అన్నారు. తన తొలి దర్శకత్వ చిత్రాన్ని తన స్నేహితుల నిర్మాణంలో వచ్చే ఏడాది ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు.
దర్శకుడిగా తన ప్రణాళికల గురించి సతీష్ వివరిస్తూ, “డెబ్యూ మూవీ అనేది చాలా ముఖ్యం. ప్రస్తుతం ప్రేక్షకులు మెసేజ్‌ల కంటే ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఎక్కువగా కోరుకుంటున్నారు. ‘బలగం’, ‘లిటిల్ హార్ట్స్’ వంటి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలే ఇందుకు నిదర్శనం. అందుకే తక్కువ బడ్జెట్‌లో, ప్రేక్షకులను బాగా నవ్వించే మంచి కంటెంట్ ఉన్న సినిమా చేస్తాను. కొత్తవారితో అయితే డేట్స్ ఇబ్బంది ఉండదు, కానీ ఏ హీరో ఓకే అన్నా సినిమా చేయడానికి సిద్ధం. నా ఫేవరెట్ హీరో నాని గారితో సినిమా చేయాలని ఉంది,” అని అన్నారు. దర్శకుడిగా మారుతున్నప్పటికీ, నిర్మాతగా తన సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సినిమాలు కొనసాగిస్తానని సతీష్ స్పష్టం చేశారు. “ప్రస్తుతం ఎడిటర్ ప్రవీణ్ పూడి దర్శకత్వంలో ఒక సినిమా తీస్తున్నాం. అలాగే రాజశేఖర్ గడ్డం దర్శకత్వంలో మరో సినిమా స్క్రిప్ట్ దశలో ఉంది. గతంలో నార్నె నితిన్‌తో ఉగాది రోజున ప్రారంభించిన సినిమా కొన్ని కారణాల వల్ల పట్టాలెక్కలేదు. ఇప్పుడు ఆ కథను సరికొత్తగా మార్చి త్వరలో ప్రారంభిస్తాం. ఈ రెండు సినిమాల అప్‌డేట్స్ వచ్చే ఏడాదిలో ఇస్తాను,” అని తెలిపారు.