Sara Ali Khan: తల్లిదండ్రుల విడాకుల ప్రభావం.. పెళ్లిపై సారా సంచలన వ్యాఖ్యలు

Sara Alikhan

Sara Alikhan

సారా అలీ ఖాన్, ఆయుష్మాన్ ఖురానా, రకుల్ ప్రీత్ సింగ్, వామిఖా గబ్బి ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ కామెడీ డ్రామా పతి పత్ని ఔర్ వో దో (Pati Patni Aur Woh Do). మే 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే దేశవ్యాప్తంగా రూ.17.53 కోట్ల నెట్ కలెక్షన్లతో సాలిడ్ ఓపెనింగ్స్ సాధించి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ‘పెళ్లి’ అనే టాపిక్ రాగా.. సారా అలీ ఖాన్ కుండబద్దలు కొట్టినట్లు తన మనసులోని మాటను బయటపెట్టారు.

మనకు తెలిసి సారా అలీ ఖాన్ తన తల్లిదండ్రుల వైవాహిక జీవితాన్ని చాలా దగ్గరగా చూశారు. సారా తల్లిదండ్రులైన సైఫ్ అలీ ఖాన్, అమృతా సింగ్‌లు 1991లో వివాహం చేసుకుని, 13 ఏళ్ల తర్వాత 2004లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత సైఫ్.. కరీనా కపూర్‌ను రెండో పెళ్లి చేసుకోగా, అమృతా సింగ్ మాత్రం పిల్లల కోసం ఒంటరిగానే ఉండిపోయారు. ఈ నేపథ్యాన్ని ఉద్దేశిస్తూ సారా ఎమోషనల్ గా..

‘పెళ్లిళ్లు కొన్నిసార్లు అనుకోని విధంగా పెటాకులు కావచ్చు.. అది నేను కళ్లారా చూశాను. అందుకే పెళ్లిని కేవలం ఒక అందమైన ఊహలా నేను చూడను. సమాజం కోసమో, లేదా తోడు కావాలనో తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. నా జీవితంలో ఏదో వెలితి ఉందని, దాన్ని భర్తీ చేయడానికి మరొకరు రావాల్సిన అవసరం లేదు. ఒకవేళ నాకు పర్‌ఫెక్ట్ అనిపించే సరైన వ్యక్తి దొరకకపోతే.. జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోవడానికి కూడా నేను మానసికంగా సిద్ధంగా ఉన్నాను’ తెలిపింది. ప్రస్తుతానికి తన ఫోకస్ అంతా కేవలం సినిమాలు, కెరీర్‌పైనే ఉందని, అనవసరమైన బంధాల్లోకి దూకి ఇబ్బంది పడటం కంటే కెరీర్‌లో ఎదగడమే తన ప్రస్తుత లక్ష్యమని తేల్చిచెప్పారు.