టాలీవుడ్ ఫ్యామిలీ హీరో జగపతి బాబు టాక్ షో ‘జయమ్ము నిశ్చయమ్మురా’ మంచి రేటింగ్ తో దూసుకుపోతోంది. ఇక తాజా ఎపిసోడ్ లో సందీప్ వంగా, రామ్ గోపాల్ వర్మ ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సందీప్ వంగా తన ప్రేరణలు, అనుభవాలు, రాబోయే ప్రాజెక్టుల గురించి చాలా విషయాలు పంచుకున్నారు.
Also Read : Mirai : ‘మిరాయ్’ నుంచి మరో ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్..
సందీప్ మాట్లాడుతూ.. ‘‘నా జీవితంలో రామ్ గోపాల్ వర్మ ఒక గొప్ప గురువు. ఆయన చిత్రాలు చూసి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ముఖ్యంగా ఆయన ‘సత్య’ సినిమాను 50-60 సార్లు చూశాను. ఆ సినిమానే నాకు ఎడిటింగ్ నేర్పింది’’ అని తెలిపారు. అలాగే రాజమౌళి గురించి ప్రస్తావిస్తూ, ‘‘నేను ఇప్పటివరకు చూసిన సినిమాల్లో ‘బాహుబలి 2’ ఇంటర్వెల్ సీన్ హైలైట్. దానికి మించిన ఇంటర్వెల్ సీన్ ఇప్పటి వరకు లేదు. ఆ సీన్ చూసిన తర్వాత నాకు భయం వేసింది. నేను రూపొందించిన ‘అర్జున్ రెడ్డి’ ఇంటర్వెల్ సీన్ ప్రేక్షకులకు నచ్చుతుందా అన్న ఆందోళన కలిగింది. కానీ ట్రైలర్‌కి వచ్చిన స్పందన నాకు ధైర్యం ఇచ్చింది’’ అని చెప్పారు.
ఇక తన రాబోయే ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ గురించి కూడా క్లారిటీ ఇచ్చారు. ‘‘ఒక సినిమాకు షూటింగ్ ప్రారంభానికి ముందే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పూర్తి చేస్తే చాలా టైమ్ సేవ్ అవుతుంది. ఈ విషయం నాకు ‘అర్జున్ రెడ్డి’ సమయంలో తెలియలేదు. కానీ ‘యానిమల్’ చిత్రీకరణకు ముందు 80% మ్యూజిక్ రెడీ చేసుకున్నాం. ఇప్పుడు అదే విధంగా ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’ కోసం కూడా 70% మ్యూజిక్ పూర్తయింది’’ అన్నారు.
‘‘ప్రభాస్ చాలా స్వీట్ పర్సన్. పెద్ద స్టార్ అయినా ఆయనతో పని చేయడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని అర్థమైంది. త్వరలోనే ‘స్పిరిట్’ షూటింగ్ ప్రారంభిస్తాం. అప్పుడే పూర్తి వివరాలు చెబుతాను’’ అని సందీప్ వంగా వెల్లడించారు.