Sampoornesh Babu: స్టార్‌డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!

Sampoornesh Babu

Sampoornesh Babu

Sampoornesh Babu: వెండితెరపై ‘బర్నింగ్ స్టార్’గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న సంపూర్ణేష్ బాబు రియల్ లైఫ్‌లో ఎలా ఉంటారు? తెర వెనుక ఉండే అసలైన నరసింహాచారి వ్యక్తిత్వం ఎలాంటిది? తాజాగా నాని హీరోగా నటించిన ‘ది ప్యారడైజ్’ చిత్రంలో ‘బిర్యానీ’ అనే ప్రత్యేక పాత్రతో అలరించడానికి రెడీ అవుతున్న సంపూర్ణేష్ బాబు.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, సమాజం చూసే సక్సెస్ కొలమానాలపై చేసిన కామెంట్స్ ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసేలా ఉన్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినీ రంగంలో సాధించిన సక్సెస్‌లపై స్పందిస్తూ, బయట ప్రపంచం తనను సంపూర్ణేష్ బాబుగా చూసినప్పటికీ, తన సన్నిహితుల మధ్య తాను ఎప్పటికీ పాత నరసింహాచారినే అని ఆయన స్పష్టం చేశారు. “కెమెరా ముందు మాత్రమే నేను సంపూర్ణేష్ బాబు. కెమెరా ఆఫ్ అవ్వగానే నా సొంత మనుషులు, పిల్లలు, స్నేహితుల మధ్య సాధారణ నరసింహాచారిగానే ఉంటాను. ఆ స్టార్‌డమ్‌ను నా చుట్టూ ఉన్నవాళ్లు ఎంజాయ్ చేస్తుంటారు కానీ, నాకు మాత్రం ఆ హంగులు పెద్దగా పట్టవు” అని తన మనసులోని భావాలను పంచుకున్నారు.

సమాజం విజయాన్ని కొలిచే పద్ధతిపై సంపూ సూటిగా స్పందించారు. ప్రజలు సాధారణంగా ఓ వ్యక్తి సక్సెస్‌ను అతడి ఇల్లు, కార్లు, పిల్లలు చదివే స్కూళ్లను బట్టి అంచనా వేస్తారని ప్రస్తావిస్తూ.. “సిద్దిపేటలో మంచి ఇల్లు కట్టుకున్నా, రెండు కార్లు కూడా ఉన్నాయి. కానీ ఎక్కడికైనా అత్యవసరంగా వెళ్లాల్సి వచ్చినప్పుడు డ్రైవర్ లేడనో, నాకే డ్రైవింగ్ చేసే ఓపిక లేదనో ప్రయాణాన్ని ఎప్పుడూ ఆపుకోను. వెంటనే బస్ ఎక్కేసి ప్రయాణం స్టార్ట్ చేస్తాను. నాకు అందులో ఎలాంటి ఇబ్బంది, భేషజాలు కనిపించవు” అని అన్నారు. “సమాజం కోసం బతకాల్సిన అవసరం నాకు లేదు. నా కుటుంబం, నన్ను ప్రాణంగా ఇష్టపడే వాళ్లతో సంతోషంగా ఉంటే చాలు. ఇతరుల కోసమో, ఏదో గొప్పకు పోయో నేను ఏది కొన్నా కొందరికి తక్కువగా, కొందరికి ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటప్పుడు సమాజం నన్ను ఎలా చూస్తుందనే ఆలోచనతో రిస్క్ చేయడం దండగ” అంటూ నేటి ఆర్భాటాల ప్రపంచానికి భిన్నంగా తన డౌన్-టు-ఎర్త్ ఫిలాసఫీని చాటిచెప్పారు. ‘ది ప్యారడైజ్’ చిత్రంలో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందనేది చాలా ఆసక్తికరంగా మారింది.