NTV Telugu Site icon

Saindhav OTT: ఇట్స్ అఫీషియల్.. ఫిబ్రవరి 3 నుంచి సైంధవ్ స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

వెంకటేష్ హీరోగా నటించిన ఆయన 75వ సినిమా సైంధవ్ ఎట్టకేలకు ఓటీటీ ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమైంది. గత కొద్ది రోజుల నుంచి సైంధవ్ ఓటీటీలోకి రాబోతోంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ సైంధవ్ సినిమా తమ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది అంటూ అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఫిబ్రవరి మూడో తేదీ నుంచి సైంధవ్ సినిమా తమ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది అని కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ వెల్లడించింది. వెంకటేష్ హీరోగా నటించిన ఈ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్, గెటప్ శ్రీను, ముఖేష్ రిషి, నవాజుద్దీన్ సిద్ధిఖి, ఆండ్రియా కీలక పాత్రలలో నటించారు. డ్రగ్స్, వెపన్స్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మొత్తం చంద్రప్రస్థ అనే ఒక ఊహాజనిత నగరం చుట్టూ తిరుగుతూ ఉంటుంది.

Also Read; Abhijeet: అభిజీత్ కాలికి గాయం.. సర్జరీ కూడా?

అన్నింటికీ దూరంగా ఒక పోర్టులో పని చేసుకునే వెంకటేష్ కూతురి ఇంజక్షన్ కి 17 కోట్లు కావలసి రావడంతో ఏం చేశాడు? అనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఆశించిన మేర ప్రేక్షకులను మాత్రం ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది.. ఈ నేపథ్యంలోనే నెల తిరగక ముందే ఓటీటీలోకి సినిమా అడుగుపెట్టబోతోంది. ఈ సినిమాకి హిట్ సినిమాల దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వం వహించగా నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద వెంకట్ బోయినపల్లి నిర్మించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే చిన్న సినిమాగా అందరూ భావించిన హనుమాన్ ఇప్పటికీ థియేటర్లలో మంచి రెస్పాన్స్ సాధిస్తున్న నేపథ్యంలో ఆ సినిమాని మాత్రం 60 రోజుల తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అందులో భాగంగా మార్చి రెండో వారంలో హనుమాన్ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.