Saif Ali Khan Death Threat: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌కు మరోసారి బెదిరింపులు వచ్చినట్లు ముంబై పోలీసు వర్గాలు వెల్లడించాయి. 2024లో రాజకీయ నాయకుడు బాబా సిద్ధిఖీ హత్య కేసులో నిందితుడు, ప్రస్తుతం పరారీలో ఉన్న జీషాన్ అక్తర్ పేరుతో సైఫ్‌కు హత్య బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. ఈ బెదిరింపుల వెనుక నిజంగా అక్తర్ ఉన్నాడా? లేదా ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని, పోలీసు దర్యాప్తు సంస్థలను ఇబ్బంది పెట్టేందుకు మరెవరైనా అతడి పేరును ఉపయోగిస్తున్నారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
ఇటీవల బాలీవుడ్ నటులు తుషార్ కపూర్, ఆయుష్మాన్ ఖురానాలకు కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చినట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. ఈ రెండు ఘటనల్లోనూ బెంగళూరుకు చెందిన 30 ఏళ్ల ఐఐటీ గ్రాడ్యుయేట్ వైభవ్ మిశ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడికి ఎలాంటి క్రిమినల్ గ్యాంగ్‌తో సంబంధాలు లేవని, కృత్రిమ మేధస్సు (ఏఐ) సాయంతో బెదిరింపులకు పాలపడినట్లు అధికారులు వెల్లడించారు. తాజా బెదిరింపులపై సైఫ్ అలీఖాన్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. తాజా బెదిరింపుల నేపథ్యంలో 2025 జనవరి 16న సైఫ్‌పై జరిగిన దాడి ఘటన మరోసారి చర్చకు వచ్చింది. ముంబైలోని బాంద్రాలో ఉన్న ఆయన నివాసంలోకి తెల్లవారుజామున ఓ దుండగుడు చొరబడ్డాడు. సుమారు రాత్రి 2 గంటల సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన ఆ వ్యక్తి.. సైఫ్, కరీనా కపూర్ చిన్న కుమారుడు జెహ్ గదికి వెళ్లినట్లు సమాచారం.
కుమారుడిని కాపాడేందుకు సైఫ్ ఆ దుండగుడిని ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో అతడు సైఫ్‌పై పలుమార్లు కత్తితో దాడి చేశాడు. దీంతో సైఫ్ మెడ, వీపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను లీలావతి ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు సుమారు ఆరు గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించారు. ఐదు రోజుల చికిత్స అనంతరం సైఫ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ ఘటన తర్వాత ఎదురైన భయానక పరిస్థితులను కరీనా గతంలో గుర్తుచేసుకున్నారు. ఈ ఘటన తమ కుటుంబంపై తీవ్ర మానసిక ప్రభావం చూపిందని, దాదాపు ఆరు నెలల పాటు సరిగా నిద్రపోలేకపోయానని చెప్పారు. ఇటీవల కరణ్ జోహార్ నిర్వహించే ‘కాఫీ విత్ కరణ్ సీజన్ 9’లోనూ ఈ ఘటనకు సంబంధించిన అనుభవాలను ఈ దంపతులు గుర్తుచేసుకున్నారు.

