Sai Pallavi: సాధారణంగా ఏ దర్శకుడు పాత్ర ఇచ్చినా తనదైన సహజ నటనతో దానికి ప్రాణం పోయడం సాయిపల్లవి మార్క్. ఇప్పటివరకు చేసిన ఎన్నో సినిమాల్లో డైరెక్టర్ ఆలోచనలకు తోడు తన సొంత ఇన్‌పుట్స్ కూడా జోడించి మెప్పించింది. కానీ, బాలీవుడ్ భారీ చిత్రం ‘రామాయణ’లో సీత పాత్ర దగ్గరికి వచ్చేసరికి మాత్రం తన శైలిని పూర్తిగా మార్చుకున్నట్లు తెలిపింది. తాజాగా అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షోలో పాల్గొన్న ఈ బ్యూటీ, సీత రోల్ గురించి చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రెగ్యులర్ పాత్రల్లా కాకుండా సీతాదేవిగా నటించడం ఒక అత్యున్నత బాధ్యత అని సాయిపల్లవి స్పష్టం చేసింది. “నేను చేసిన ప్రతి సినిమాలో నా సొంత ఆలోచనలు, ఇన్ పుట్స్ ఉండేవి. కానీ అంతటి పవిత్రమైన సీత పాత్ర విషయంలో నా బ్రేన్‌ని అస్సలు ఉపయోగించలేదు. అక్కడ సొంత తెలివితేటల కంటే సీతమ్మ ఆశీర్వాదం మాత్రమే ముఖ్యమని నమ్మాను. ఆ పవిత్రమైన వ్యక్తిత్వం నుంచి నేనేం నేర్చుకోవాలనే చూశాను తప్ప, నా సొంత ఆలోచనలు ఏవీ పెట్టలేదు. కేవలం ఆమె ఆశీస్సులు తీసుకొని పాత్రను మనసుతో ఆకళింపు చేసుకున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. సాయిపల్లవి మాటలకు స్వయంగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సైతం ఫిదా అయ్యారు. సీతాదేవి పట్ల ఆమె చూపిన భక్తి, వినయానికి నెటిజన్లు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. నితేశ్ తివారి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీతగా సాయిపల్లవి స్క్రీన్‌పై ఎలా మెప్పించబోతోందో చూడాలని సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

