సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ ప్రస్తుతం ‘సంబరాల ఏటి గట్టు’ అనే భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. కెరీర్ లో హయ్యెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా రాబోతుంది. అలాగే షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో క చిత్ర దర్శకులతో సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సాయి తాజాగా మరో ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారు. ‘సేవ్ ద టైగర్స్’ వెబ్ సిరీస్ ఫేమ్ తేజ కాకమాను దర్శకత్వంలో సాయి దుర్గ తేజ్ హీరోగా ఓ సరికొత్త సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ క్రేజీ కాంబినేషన్‌పై ఇండస్ట్రీ వర్గాల్లో ఇప్పుడే ఆసక్తి నెలకొంది.
ఈ చిత్రానికి మేకర్స్ ‘పార్వేట‘ అనే అత్యంత ఆసక్తికరమైన మరియు వైవిధ్యమైన టైటిల్‌ను ఖరారు చేశారట. ఒక వైవిధ్యమైన కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు దర్శకుడు తేజ కాకమాను సర్వం సిద్ధం చేస్తున్నారు. సినిమాకు పెట్టిన ‘పార్వేట’ అనే పేరు వెనుక ఒక విశిష్టమైన నేపథ్యం ఉంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అహోబిలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రతీ ఏటా అత్యంత వైభవంగా జరిగే ఒక సాంప్రదాయ ఉత్సవమే ఈ ‘పార్వేట’. ఈ ఉత్సవానికి ఎంతో విశిష్టమైన చారిత్రక, సాంస్క్రృతిక నేపథ్యం ఉంది. మరి ఈ ఆధ్యాత్మిక చారిత్రక అంశాలను కథకు ఎలా ముడిపెట్టారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జెట్ స్పీడ్ లో జరుగుతున్నాయి. నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. త్వరలోనే ఈ సినిమాను అధికారికంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించి, రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుపెట్టేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

