సెలబ్రిటీలు ఏదో ఒక సామాజిక సేవ చేస్తూనే ఉంటారు. పేదల కోసం, పిల్లల కోసం తమకు తోచిన సాయం చేస్తూనే ఉంటారు. కొందరు ఉచితంగా వైద్యం అందిస్తుంటే..మరి కొందరు ఉచితంగా విద్య, ఆహారం కూడా అందిస్తుంటారు. రీల్ హీరోలు రియల్ హీరోలవడం అంటే ఇదే. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు ఆపదలో ఉన్న అనేకమందిని ఆదుకున్నారు. అయితే తాజాగా ఓ ప్రముఖ హీరో కొందరు పేదలకు చేసిన సాయం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది. అతనెవరో కాడు.. తమిళ నటుడు సూర్య(Surya). సూర్య మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు. తాను నటిస్తున్న సినిమా కోసం వేసిన సెట్ పేదలకు ఇచ్చేశాడు. షూటింగ్ కోసం నిర్మించిన ఇళ్లను పేద మత్స్యకారులకు ఉచితంగా అందించాలని సూర్య నిర్ణయం తీసుకున్నారు.
బాల దర్శకత్వంలో సూర్య (Suriya) నటిస్తున్న చిత్రం షూటింగ్ (Movie Shooting) ప్రస్తుతం కన్యాకుమారిలో వేగంగా జరుగుతోంది. షూటింగ్ కోసం జాలర్లు నివసించే గుడిసెల తరహాలోనే భారీ ఖర్చుతో ఇళ్లను నిర్మించారు. అయితే అక్కడ ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యాక వాటిని కూల్చివేయకుండా ఇళ్లు లేని నిరుపేద మత్స్యకారులకు ఇవ్వాలని, వారికి నీడను కల్పించాలని సూర్య నిర్ణయించారు. దీంతో సూర్య చేసిన ఈ ఆలోచనను, ఆశయాన్ని ఆయన అభిమానులు, ఆ ప్రాంతంలోని ప్రజలు అభినందిస్తున్నారు. సూర్యపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Suriya With Director Bala
ఇటీవలే సూపర్ హిట్ అయిన సూర్య (Suriya) సినిమా జైభీమ్ గురించి కూడా అందరికీ తెలిసిందే. ఈ సినిమా సమయంలో కూడా సూర్య తన గొప్ప మనసు చాటుకున్నాడు. జై భీమ్ (Jai Bhim) సినిమాతో అందరికీ తెలిసిన రియల్ సినతల్లి అమ్మాళ్ కు సూర్య సాయం చేశాడు. అమ్మాళ్ పేరు హీరో సూర్య రూ. 10 లక్షలను బ్యాంక్ లో ఫిక్స్ డ్ డిపాజిట్ చేసిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా దాని నుంచి వచ్చే నెల వారి వడ్డీని అమ్మాళ్ కు అందేలా సూర్య చూశాడు. అయితే ఈ అమ్మాళ్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా జై భీమ్ అనే సినిమా తెరకెక్కింది.
మోహన్ లాల్ మంచి మనసు
మరోవైపు మలయాళ అగ్రనటుడు మోహన్ లాల్ కూడా తన మంచి మనసును చాటుకున్నారు. పేద విద్యార్థులకు ఆయన అండగా నిలిచారు. మోహన్ లాల్ 20 మంది పేద విద్యార్థుల చదువుకు అయ్యే ఖర్చును భరించేందుకు ముందుకొచ్చారు. ఈ విషయాన్ని ఆయన ఫేస్ బుక్ ద్వారా వెల్లడించారు. విశ్వశాంతి ఫౌండేషన్ సహకారంతో అట్టపాడికి చెందిన గిరిజన బాలలను ఎంపిక చేసి 15 ఏళ్ల పాటు వారిని చదివించనున్నట్లు మోహన్ లాల్ తెలిపారు.దీంతో మోహన్ లాల్ పై కూడా నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.