మాస్ మహారాజా రవితేజ మరియు శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం ‘మాస్ జాతర’ నుండి చిత్ర బృందం మరో అదిరిపోయే మాస్ సాంగ్‌ను విడుదల చేసింది. ‘సూపర్ డూపర్’ అంటూ సాగే ఈ ఉత్సాహభరితమైన గీతం, శ్రోతలకు మాస్ విందును అందిస్తోంది. ‘మాస్ జాతర’ ఆల్బమ్ నుండి ఇప్పటికే విడుదలైన ‘తు మేరా లవర్’, ‘ఓలే ఓలే’, ‘హుడియో హుడియో’ గీతాలు సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకొని, సోషల్ మీడియాను ఉర్రూతలూగించాయి. తాజాగా విడుదలైన ఈ నాలుగో గీతం, సినిమా ఆల్బమ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో ఈ ‘సూపర్ డూపర్’ గీతాన్ని రవితేజ మాస్ ఇమేజ్‌కు, శ్రీలీల ఎనర్జీకి తగ్గట్టుగా అద్భుతంగా స్వరపరిచారు. అందరినీ కాలు కదిపేలా ఎంతో హుషారుగా ఉన్న ఈ ట్యూన్‌కు, భీమ్స్ సిసిరోలియో మరియు రోహిణి సోరట్ తమ గానంతో మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చారు. గీత రచయిత సురేష్ గంగుల అందించిన ఉల్లాసభరితమైన సాహిత్యం అందరూ పాడుకునేలా ఉంది.
Also Read :Nayanthara : చిరంజీవి ఇంట్లో నయనతార ఫ్యామిలీ.. పిక్స్ వైరల్
ఈ పాటలో మునుపటి మాస్ మహారాజాను గుర్తుచేసేలా రవితేజకు మాత్రమే సాధ్యమయ్యే స్వాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరోవైపు శ్రీలీల తన అద్భుతమైన నృత్య ప్రదర్శనతో తెరపై వెలుగులు వెదజల్లారు. తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన భాను భోగవరపు, ‘మాస్ జాతర’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. చిత్ర ప్రకటన వచ్చినప్పటి నుండి భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా, ఇప్పటికే విడుదలైన టీజర్ మరియు మూడు పాటలతో విశేష స్పందన రాబట్టుకుంది. తాజాగా విడుదలైన ‘సూపర్ డూపర్’ గీతం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది.’మాస్ జాతర’ అక్టోబర్ 31న థియేటర్లలోకి అడుగుపెట్టనుంది.