Ravi Teja: టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ట్రాక్ రికార్డు ఎలా ఉన్నా, ఆయన పారితోషికం లెక్కలు ఎప్పుడూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్కే. సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా తగ్గేదే లేదంటూ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసే రవితేజ.. తాజాగా వచ్చిన ఇరుముడి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత ఏకంగా తన రెమ్యూనరేషన్‌ను రెట్టింపు చేశారన్న వార్త ఫిల్మ్‌నగర్ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఏకంగా రూ. 50 కోట్ల డిమాండ్ తెరపైకి రావడంతో, ఆయన చేతిలో ఉన్న ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేజారిపోయినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా ప్రచారం సాగుతోంది. 2022లో వచ్చిన ‘ధమాకా’ తర్వాత నాలుగేళ్లపాటు రవితేజకు కనీసం యావరేజ్ అన్న మాటే లేదని ట్రేడ్ వర్గాల మాట. వరుసగా ఆరు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడ్డాయి. కనీసం రూ.10 కోట్ల షేర్ రాబట్టడానికి కూడా నానా తంటాలు పడాల్సి వచ్చింది. అలాంటి క్లిష్ట సమయంలో వచ్చిన ‘ఇరుముడి’ చిత్రం రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. రూ.20 కోట్లకు అమ్మిన ఈ సినిమా ఏకంగా రూ.145 కోట్ల షేర్, రూ.245 కోట్ల గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డులు సృష్టించింది.
ముఖ్యంగా ఈ చిత్రానికి తక్కువ పారితోషికం తీసుకుని, నైజాం ఏరియా లాభాల్లో వాటా తీసుకునేలా చేసుకున్న ఒప్పందం రవితేజకు కనకవర్షం కురిపించింది. రెమ్యునరేషన్‌గా తీసుకున్న రూ.7 కోట్లకు నైజాం లాభాల వాటా కలవడంతో ఆయన ఖాతాలోకి ఏకంగా రూ.50 కోట్లకు పైగా చేరినట్లు సమాచారం. ఆ మధ్య జరిగిన సక్సెస్ మీట్‌లో డైరెక్టర్ అనిల్ రావిపూడి సైతం “నైజాం మనదే.. జాక్‌పాట్” అంటూ వేసిన పంచ్‌కి రవితేజ పడిపడి నవ్వడం ఈ డీల్‌కు బలం చేకూర్చింది. ‘ఇరుముడి’ తెచ్చిన క్రేజ్‌తో రవితేజ తన తర్వాతి చిత్రాలకు ఏకంగా రూ.50 కోట్ల పారితోషికాన్ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఫ్లాపుల్లో ఉన్నప్పుడే రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్ల దాకా తీసుకున్న ఆయన, ఇప్పుడు ఏకంగా డబుల్ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో నిర్మాతలు విస్తుపోతున్నారట. ఈ క్రమంలోనే ‘స్వాగ్’ ఫేమ్ హసిత్ గోలి డైరెక్షన్‌లో, దిల్ రాజు నిర్మాణంలో రవితేజ ఓ సినిమా చేయాల్సి ఉంది. ‘రాజా ది గ్రేట్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత దాదాపు పదేళ్లకు దిల్ రాజు – రవితేజ కాంబో రిపీట్ కానుండటంతో పాటు, వచ్చే సంక్రాంతికే రిలీజ్ చేస్తామని స్వయంగా నిర్మాతలు ప్రకటించడంతో ఈ సినిమా అంచనాలు పెరిగాయి. అయితే రవితేజ రూ.50 కోట్లు కావాలని పట్టుబట్టడంతో దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని, దాంతో ఈ సినిమా దాదాపు అటకెక్కినట్లేనని తెలుస్తోంది. అన్ని సినిమాలు ‘ఇరుముడి’లా ఆడవని, గత నాలుగేళ్ల ట్రాక్ రికార్డును దృష్టిలో ఉంచుకోకుండా అంత భారీ మొత్తం డిమాండ్ చేయడం రిస్క్ అని నిర్మాతలు భావిస్తున్నారట. హసిత్ గోలి ప్రాజెక్ట్ క్యాన్సల్ అయినట్లే కనిపిస్తుండగా, రవితేజ లైన్‌లో పెట్టిన మరో దర్శకుడు వివేక్ ఆత్రేయ ప్రాజెక్ట్‌పైనా ఇప్పుడు టెన్షన్ స్టార్ట్ అయ్యిందట. లక్ష్మణ్ నిర్మించనున్న ఈ సినిమాకు రవితేజ ఇదే స్థాయిలో రూ.50 కోట్లు డిమాండ్ చేస్తే నిర్మాతలు ముందుకొస్తారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

