Rashmika : 400 కుటుంబాలను దత్తత తీసుకున్న రష్మిక

Rashmika Ranabaali Trailer Launch

Rashmika Ranabaali Trailer Launch

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తన గొప్ప మనసు చాటుకుంది. తెరపై క్యూట్ లుక్స్‌తో, అదిరిపోయే పర్ఫార్మెన్స్‌తో మెప్పించే ఈ బ్యూటీ.. నిజ జీవితంలోనూ తాను ఎంత మంచిదో మరోసారి నిరూపించింది. విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘రణబాలి’ అక్టోబర్ 16న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమాలో ఆమె పోషించిన ‘జయమ్మ’ పాత్ర ఎంత పవర్‌ఫుల్ అనేది ఇప్పటికే రిలీజైన కంటెంట్ చూస్తే అర్థమవుతోంది. అయితే, అదే పాత్ర స్ఫూర్తితో రష్మిక ఇప్పుడు ఏకంగా 400 పేద కుటుంబాలకు అండగా నిలబడి ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.
రణబాలిలోని జయమ్మ క్యారెక్టర్ నుంచి స్ఫూర్తి పొందిన రష్మిక.. ‘అన్నపూర్ణ’ అనే బృహత్తర సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 8 వివిధ ప్రాంతాలకు చెందిన ఏకంగా 400 పేద కుటుంబాలను ఆమె దత్తత తీసుకుంది. ఆయా కుటుంబాలకు మూడు నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులను పంపిణీ చేసి పెద్ద మనసు చాటుకుంది. అంతేకాదు, ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో ఆపేయకుండా, ఏడాది పాటు నిరంతరాయంగా ప్రతి మూడు నెలలకూ సరుకులు అందిస్తానని ప్రకటించి సంచలనం సృష్టించింది.
తన సేవా కార్యక్రమాలపై రష్మిక స్పందిస్తూ.. “సినిమాలోని జయమ్మ పాత్రకు, మీ నిజ జీవితానికి ఏమైనా పోలికలు ఉన్నాయా అని నన్ను చాలామంది అడుగుతుంటారు. దానికి నా సమాధానం ఎప్పుడూ ‘అవును’ అనే! మీరు నాపై చూపిస్తున్న అంతులేని ప్రేమకు కృతజ్ఞతగానే నేను ఎప్పటినుంచో ఇలాంటి సాయం చేస్తున్నాను. కానీ వాటిని పబ్లిసిటీ చేసుకోవడం ఇష్టం లేక ఎవరికీ చెప్పలేదు, కేవలం నా టీమ్‌కు తెలిస్తే చాలనుకున్నాను. అయితే నా ఈ అడుగు చూసి కనీసం మరో పదిమంది స్ఫూర్తి పొందినా చాలనే ఉద్దేశ్యంతోనే ఇప్పుడు బయటపెడుతున్నాను. ఈ 400 కుటుంబాలకు నేను సరుకులు ఇవ్వడం వల్ల, వారు ఆ ఖర్చుల డబ్బును తమ భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేసుకుంటారని ఆశిస్తున్నాను” అని ఎమోషనల్ అయ్యింది.