జోయా అఖ్తర్ దర్శకత్వంలో వచ్చిన ‘గల్లీ బాయ్’ మొదట రణబీర్ వద్దకు వెళ్లింది. కానీ, కపూర్ వద్దనటంతో మన సింగ్ గారి వద్దకు వెళ్లింది. రణబీర్ వద్దన్న పాత్రని రణవీర్ సింగ్ ఎగిరి గంతేసి ఒప్పేసుకున్నాడు. సీన్ కట్ చేస్తే, ‘గల్లీ బాయ్’ సూపర్ హిట్! జోయా అఖ్తర్ సినిమా రణబీర్ వద్దనటం ‘గల్లీ బాయ్’ విషయంలోనే కాదు… మరోసారి కూడా జరిగింది. ‘దిల్ దఢక్ నే దో’ సినిమాలో అనీల్ కపూర్ తనయుడిగా రణబీర్ నటించాల్సింది.
మరి రణబీర్ బదులు ఎవరు నటించారు? ఇంకెవరూ, మళ్లీ రణవీరే! రణబీర్ వద్దంటే రణవీర్ ముద్దన్న మరో సినిమా ‘బ్యాండ్ బాజా బారాత్’. ఈ సినిమా కోసం కూడా ఫస్ట్ ఛాయిస్ గా రణబీర్ నే అప్రోచ్ అయ్యారు ఫిల్మ్ మేకర్స్. కానీ, రణబీర్ బ్యాండ్ బాజాకు నై అనటంతో రణవీర్ బారాత్ లో ఉత్సాహంగా చిందులేసేశాడు! ఆమీర్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ ‘ఢిల్లీ బెల్లీ’ సినిమాతో మంచి సక్సెస్ ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా కూడా ఇమ్రాన్ కంటే ముందు రణబీర్ కపూర్ వద్దకి వెళ్లి వచ్చింది.
కాస్త ఘటైన కామెడీతో జనాలకి షాకిచ్చిన ‘ఢిల్లీ బెల్లి’ హిట్టైనప్పటికీ… రణబీర్ లవర్ బాయ్ ఇమేజ్ కి సూట్ కాదనే చెప్పుకోవాలి… పాపం జోయా అఖ్తర్ సినిమాల్ని పదే పదే రిజెక్ట్ చేయటం రణబీర్ కి సరదా అనుకుంటా! ‘గల్లీ బాయ్, దిల్ దఢక్ నే దో’ చిత్రాలే కాదు… ఆమె ‘జిందగీ నా మిలేగీ దొబారా’లో ఆఫర్ ఇస్తే కూడా సారీ అన్నాడట! హృతిక్ రోషన్ ఆ పాత్రలో హ్యాపీగా యూరోపియన్ రొమాన్స్ నడిపించాడు… కత్రీనాతో! రణబీర్ కపూర్ వద్దంటే మరో కపూర్ హీరో చేసిన చిత్రం ‘2 స్టేట్స్’. ఇది కూడా ఎందుకోగానీ రణబీర్ కి నచ్చలేదు. అర్జున్ కపూర్ తన ఖాతాలో వేసుకున్నాడు!
