Ramayana: ఆస్కార్స్ వేదికపై ‘రామాయణ’ వరల్డ్ ప్రీమియర్: నమిత్ మల్హోత్రా

Namit Malhotra

Namit Malhotra

Ramayana: “భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలన్నదే మా సంకల్పం. అందుకే మా ‘రామాయణ’ చిత్రానికి సంబంధించి ఒక బిగ్గెస్ట్ అనౌన్స్‌మెంట్ చేస్తున్నాం. వచ్చే అక్టోబర్ 27న లాస్ ఏంజిల్స్‌లోని ప్రతిష్టాత్మక ‘ది అకాడమీ థియేటర్’ (ఆస్కార్స్ వేదిక)లో ‘రామాయణ’ గ్రాండ్ వరల్డ్ ప్రీమియర్‌ను నిర్వహించబోతున్నాం. అక్కడి నుంచే మా గ్లోబల్ ప్రయాణాన్ని మొదలుపెట్టి, ఆ తర్వాత నవంబర్ 5న మన దేశంలోకి, ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకొస్తాం” అని చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రా స్వయంగా వెల్లడించారు. తాజాగా నిర్వహించిన ప్రీ-రిలీజ్ వేదికపై ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.

ఈ ప్రాజెక్ట్ ఆలోచన గురించి నమిత్ మాట్లాడుతూ.. “మేం రామాయణ చిత్రాన్ని ఏదో ఒక హిందీ సినిమాగానో, తెలుగు సినిమాగానో తెరకెక్కించలేదు. ఇది నూటికి నూరు శాతం మన భారతీయ సినిమా. మా అందరి హృదయాల నుంచి పుట్టిన సినిమా ఇది. మన గుండెలకు అత్యంత దగ్గరైన ఒక గొప్ప గాథను, మన చరిత్రను ప్రపంచం ముందు ఎంతో గర్వంగా చూపించాలన్నదే మా ఏకైక లక్ష్యం” అని స్పష్టం చేశారు. గ్లోబల్ స్థాయిలో సినిమాను ప్రదర్శించడం వెనుక ఉన్న ప్రేరణను వివరిస్తూ.. “మన దేశంలో ఎంతోమంది గొప్ప దర్శకులు ఉన్నారు. ముఖ్యంగా రాజమౌళి గారు ఇండియన్ సినిమాను ప్రపంచ పటంలో నిలబెట్టిన తీరు అద్భుతం. ఇవాళ లాస్ ఏంజిల్స్ లేదా హాలీవుడ్‌కు వెళ్తే ప్రతి ఒక్కరికీ ‘ఆర్ఆర్ఆర్’ తెలుసు. అది ఎవరైనా గర్వించదగ్గ గొప్ప విజయం. వారిని చూసే మేం కూడా స్ఫూర్తి పొందాం. హాలీవుడ్ ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ప్రభావాన్ని చూపిస్తోందో, అంతకుమించిన టాలెంట్ మన దగ్గర కూడా ఉంది. ఆ నమ్మకంతోనే మన దేశపు గొప్ప కథతో ప్రపంచ వేదికపై గర్వంగా అడుగుపెడుతున్నాం. మీ అందరి ప్రేమ, ఆశీస్సులు మాకు చాలా ముఖ్యం” అని నమిత్ మల్హోత్రా అన్నారు. దర్శకుడు నితేష్ తివారీ రూపొందించిన ఈ విజువల్ వండర్ నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది.