Ramayana Controversy: రణబీర్ కపూర్ రాముడిగా, యశ్ రావణుడిగా, సాయిపల్లవి సీతగా… నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ‘రామాయణ’ అనౌన్స్ అయినప్పటి నుంచే ఇండియా మొత్తం దీని గురించే చర్చ. వేల కోట్ల బడ్జెట్, హాలీవుడ్ స్థాయి విజువల్స్ అంటూ భారీ అంచనాలు క్రియేట్ చేశారు. తీరా చూస్తే, బయటకు వచ్చిన ఇంటర్నేషనల్ ట్రైలర్ హైప్‌ని పెంచడం అటుంచి ఊహించని వివాదాలకు ఆజ్యం పోస్తోంది. ట్రైలర్లో అందరినీ షాక్‌కి గురిచేసిన విషయం శ్రీరాముడి పాత్రపై వచ్చిన ఇంగ్లీష్ డైలాగ్. గ్లోబల్ మార్కెట్‌కు కనెక్ట్ చేయాలనే తాపత్రయంతో, రాముడిని దైవస్వరూపంగా కాకుండా కేవలం ‘సాధారణ మనిషి’ అన్నట్లుగా చూపించే ప్రయత్నం చేశారనే టాక్ మొదలైంది. కోట్లాది మంది ఆరాధ్య దైవాన్ని ఒక కమర్షియల్ యాక్షన్ హీరోలా మార్చేయడం ఏంటని భక్తులు, నెటిజన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అసలు రామాయణంలో ఉండాల్సిన అసలైన ఎమోషన్ కంటే, రణబీర్ వర్సెస్ యశ్ బాక్సాఫీస్ వార్ మీదే మేకర్స్ ఎక్కువ దృష్టి పెట్టారా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. కేజీఎఫ్ తర్వాత యశ్కున్న మాస్ ఫాలోయింగ్‌ను క్యాష్ చేసుకునే క్రమంలో రావణుడి పాత్రను అమితంగా గ్లోరిఫై చేస్తూ, మూలకథలోని ఆత్మను పక్కన పెట్టేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. హాలీవుడ్ లెజెండ్ హన్స్ జిమ్మెర్, ఏఆర్ రెహమాన్ లాంటి దిగ్గజాలు సంగీతం అందిస్తున్న ఈ సినిమా సుమారు 3 గంటల 15 నిమిషాల నిడివితో రానుందని సమాచారం. విజువల్ ఎఫెక్ట్స్ ఎంత రిచ్‌గా ఉన్నా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎంత అదిరిపోయినా… రామాయణం అంటే భారతీయులకు ఒక సినిమా మాత్రమే కాదు, అదొక సెంటిమెంట్. ఆ సున్నితమైన భావోద్వేగాలను పక్కనపెట్టి కేవలం స్టార్ పవర్, భారీ గ్రాఫిక్స్ నమ్ముకుంటే థియేటర్లలో తీవ్ర ఫలితాలు తప్పవని ట్రేడ్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. వివాదాల నడుమ విడుదలవుతున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్త ప్రేక్షకులను మెప్పిస్తుందా లేక విమర్శల పాలవుతుందా అన్నది కాలమే నిర్ణయించాలి.

