#BanTheCensor: తన సంచలన వ్యాఖ్యలతో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వార్తల్లో నిలిచారు. భారతీయ చిత్రాలకు ప్రస్తుతం అమలులో ఉన్న సెన్సార్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని ఆయన తాజాగా సోషల్ మీడియా వేదికగా బహిరంగంగా డిమాండ్ చేశారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో సినిమాలపై సెన్సార్ విధించడం ప్రేక్షకులను అవమానించడం తప్ప మరొకటి కాదని ఆయన తన పోస్ట్‌లో తీవ్రంగా విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన తన పోస్ట్‌లో ఈ విధంగా రాసుకొచ్చారు.. స్మార్ట్‌ఫోన్లు, ఓటీటీలు, సోషల్ మీడియా, అంతర్జాతీయ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులో ఉన్న ఈ కాలంలో పెద్దలు ఏ సినిమా చూడాలో ఒక కమిటీ నిర్ణయించడం పూర్తిగా పాత ఆలోచన అని వర్మ అన్నారు. దేశ నాయకుడిని ఎన్నుకునేంత బాధ్యత ఉన్న 18 ఏళ్ల యువకుడికి ఏ సినిమా చూడాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ కూడా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకవైపు ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఇచ్చి, మరోవైపు సినిమా విషయంలో ప్రేక్షకులపై నమ్మకం లేకపోవడం విరుద్ధమైన వైఖరని అని ఆయన పేర్కొన్నారు.
సినిమా అనేది దర్శకుడి దృక్పథాన్ని ప్రతిబింబించే కళారూపమని, దాన్ని అంగీకరించాలా లేదా అనేది పూర్తిగా ప్రేక్షకుల నిర్ణయమని ఆయన స్పష్టం చేశారు. థియేటర్లలో కొన్ని సన్నివేశాలను కత్తిరించడం వల్ల ప్రయోజనం లేదని, అవే సన్నివేశాలు సోషల్ మీడియా, టెలిగ్రామ్, టోరెంట్స్ వంటి వేదికల ద్వారా గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు వస్తాయని ఆయన చెప్పారు. సెన్సార్ కత్తెర వేయడం వల్ల కంటెంట్ తొలగించబడదని, అదే కంటెంట్‌కి మరింత ప్రచారం లభిస్తుందని వ్యాఖ్యానించారు. పిల్లలు కూడా నిత్యం హింసాత్మక వార్తలు, వివిధ రకాల ఆన్‌లైన్ కంటెంట్ చూస్తున్న ఈ కాలంలో కేవలం సినిమాలపైనే పరిమితులు విధించడం ఏమాత్రం సరికాదని ఆయన అన్నారు. సినిమా సమాజంలోని అంశాలపై చర్చకు దారితీసే శక్తివంతమైన మాధ్యమమని, అలాంటి కళారూపాన్ని నియంత్రించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే నిర్మాతలు, దర్శకులు ఇకపై సెన్సార్ బోర్డు విధించే అనవసరమైన కోతలను అంగీకరించకుండా ఒకే వేదికపైకి రావాలని వర్మ తన పోస్ట్‌లో పిలుపునిచ్చారు. ప్రస్తుత రూపంలో ఉన్న సెన్సార్ బోర్డు వ్యవస్థను కోర్టుల్లోనూ, ప్రజా చర్చల్లోనూ సవాల్ చేయాల్సిన సమయం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. సినిమాలకు కత్తెరలు విధించడం కంటే, అందులోని అంశాలపై స్పష్టమైన సమాచారం ఇచ్చి, చూడాలా వద్దా అనేది ప్రేక్షకుల నిర్ణయానికే వదిలేయాలని సూచించారు. చివరగా #BanTheCensor హ్యాష్‌ట్యాగ్‌తో తన అభిప్రాయాన్ని ఆయన తన పోస్ట్‌లో వ్యక్తం చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.
CENSOR should be BANNED
Censoring Films Actually is an INSULT to the AUDIENCES
In an era of smartphones, global streaming, and access to infinite information, to pretend that a government appointed committee (What is the qualification of its members ?) can shield adults from…— Ram Gopal Varma (@RGVzoomin) July 15, 2026

