Ram Charan : రామ్ చరణ్‌కు శస్త్రచికిత్స విజయవంతం

Ram Charan Bat

Ram Charan Bat

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు గుడ్ న్యూస్.  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కుడిచేతి మణికట్టు (Right Wrist) తీవ్ర సమస్యకు గురికావడంతో కోయంబత్తూరులోని ప్రముఖ గంగా హాస్పిటల్‌లో ఆయనకు శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం ఆపరేషన్ విజయవంతంగా పూర్తవడంతో మెగా అభిమానులు, సినీ లోకం ఊపిరి పీల్చుకుంది. ఈ శస్త్రచికిత్సను అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు ఆర్థోపెడిక్ రంగంలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన లెజెండరీ డాక్టర్ ఎస్. రాజశేఖరన్ నాయకత్వం వహించారు. గతంలో మెగాస్టార్ చిరంజీవికి ఎదురైన అత్యంత క్లిష్టమైన వెన్నెముక సమస్యను కూడా ఈయనే విజయవంతంగా నయం చేశారు. రామ్ చరణ్ మణికట్టు సమస్యకు అత్యుత్తమ చికిత్స అందించాలనే ఉద్దేశంతో అమెరికాలోని మయామికి చెందిన ప్రముఖ హ్యాండ్ అండ్ రిస్ట్ సర్జన్ డాక్టర్ అలెహాండ్రో బాడియాను ప్రత్యేకంగా కోయంబత్తూరుకు రప్పించారు. సాధారణంగా స్పోర్ట్స్ ఇంజరీలు, మణికట్టు శస్త్రచికిత్సలలో నిపుణుడైన డాక్టర్ బాడియా అపాయింట్‌మెంట్ దొరకడమే ఎంతో అరుదు. అలాంటిది ఆయన స్వయంగా ఇండియా వచ్చి సర్జరీలో పాల్గొనడం విశేషం.

డాక్టర్ రాజశేఖరన్, డాక్టర్ అలెహాండ్రో బాడియా మరియు డాక్టర్ ప్రవీణ్ భరద్వాజలతో కూడిన నిపుణుల బృందం ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ప్రస్తుతం రామ్ చరణ్ కోలుకుంటున్నారని, ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా సంతృప్తికరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మరో నాలుగు రోజుల పాటు ఆసుపత్రి వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకున్న అనంతరం ఆయన హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. కుమారుడి ఆపరేషన్ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతిమణి సురేఖతో పాటు ఉపాసన కొణిదెల కోయంబత్తూరులోనే ఉండి రామ్ చరణ్‌ను దగ్గరుండి చూసుకుంటున్నారు. కాగా, డాక్టర్ రాజశేఖరన్‌తో చిరంజీవికి ఎన్నో ఏళ్లుగా మంచి ఆత్మీయ అనుబంధం ఉంది. రామ్ చరణ్ పూర్తి ఆరోగ్యంతో, త్వరగా కోలుకుని మళ్లీ సెట్స్‌లోకి అడుగుపెట్టి షూటింగ్‌లలో పాల్గొనాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు.