Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కిన్న భారీ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో చిత్ర బృందం బెంగళూరులో గ్రాండ్‌గా ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ వేడుకలో రామ్ చరణ్ పాల్గొని, కన్నడ ప్రేక్షకుల గురించి ఎంతో ఎమోషనల్‌గా మాట్లాడారు.
శివన్నతో నటించడం నా జన్మ ధన్యం..
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ (శివన్న) పై రామ్ చరణ్ ప్రశంసల వర్షం కురిపించారు. “శివన్న నాకు ఒక తండ్రి లాంటి వారు, ఒక అంకుల్, ఒక సోదరుడు.. ఆయన ఇండియన్ సినిమా లెజెండ్. కన్నడ ఇండస్ట్రీ చక్రవర్తి అయిన శివన్నతో కలిసి పని చేయడంతో నా జన్మ ధన్యమైంది. ఆయన మా సెట్స్‌లో ఉండటం, ఆయన చూపించిన లవ్ అండ్ అఫెక్షన్ ఈ సినిమాకు ఎంతో బలాన్ని ఇచ్చాయి” అని చరణ్ ఎమోషనల్ అయ్యారు. ‘ఆర్ఆర్ఆర్’ (RRR) తర్వాత దాదాపు రెండున్నర సంవత్సరాల గ్యాప్ తర్వాత తాను బిగ్ స్క్రీన్ మీదకు వస్తున్నానని చరణ్ గుర్తు చేసుకున్నారు. “ఈ సినిమా కోసం మేమందరం చాలా కష్టపడ్డాం. నిజంగా సిన్సియర్‌గా ప్రాణం పెట్టి ఈ సినిమాను చేశాను. ఈ మాట రాసి పెట్టుకోండి.. ‘పెద్ది’ నా కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలింస్‌గా నిలిచిపోతుంది. నా లైఫ్‌లో నేను చేసిన మోస్ట్ ఇన్‌స్పైరింగ్ మూవీ ఇది. థియేటర్లలో ఈ సినిమా చూస్తున్నప్పుడు మేమెందుకు ఇంత సిన్సియర్‌గా ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నామో, ఎంతలా ప్రాణం పెట్టి నటించామో మీకే అర్థమవుతుంది” అని చిత్ర విజయంపై ధీమా వ్యక్తం చేశారు.
ఈ ప్రాజెక్ట్ సాకారం కావడానికి ముఖ్య కారకుడైన స్టార్ డైరెక్టర్ సుకుమార్‌కు చరణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సుకుమార్ వల్లే ఈ సినిమా సాధ్యమైందని అన్నారు. అలాగే కథను అద్భుతంగా రాసిన దర్శకుడు బుచ్చిబాబు సానా లేకపోతే ఈ ‘పెద్ది’ లేనేలేడని కొనియాడారు. సినిమాకు బ్యూటిఫుల్ విజువల్స్ అందించిన సినిమాటోగ్రాఫర్ రాండీ (రత్నవేలు), సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, తోటి నటులు జగపతి బాబు, బోమన్ ఇరానీలకు థాంక్స్ చెప్పారు. ప్రొడ్యూసర్‌గా ఈ సినిమాపై హార్ట్ పెట్టి ఖర్చు చేసిన సతీష్ కిలార్‌ను అభినందించారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన జాన్వీ కపూర్ సిన్సియారిటీని చరణ్ మెచ్చుకున్నారు. బెంగళూరు ప్రమోషన్స్ కి వచ్చినందుకు ఆమెకు థాంక్స్ చెబుతూ.. “జాన్వీ ఈ సినిమాలో ఎంతో సిన్సియర్‌గా యాక్ట్ చేసింది. నువ్వు మీ అమ్మగారు (అతిలోక సుందరి శ్రీదేవి) కంటే పెద్ద స్టార్‌గా ఎదగాలని, ఆమె కంటే ఎక్కువ పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని అన్నారు.
ప్రస్తుతానికి తనకు కన్నడ రాదని, కానీ ఈ సినిమా కోసం ‘తొంబా కష్టపట్టి’ (చాలా కష్టపడి) పని చేశామని చరణ్ చెప్పారు. “ఇప్పుడు కన్నడ ‘స్వల్ప స్వల్ప’ (కొంచెం కొంచెం) వచ్చు.. కానీ నెక్స్ట్ ప్రెస్ మీట్ కల్లా కన్నడ బాగా నేర్చుకుని వస్తా.. అప్పుడు ‘జాదా జాదా’ (ఎక్కువ) మాట్లాడుతా” అని చరణ్ అనడంతో కన్నడ ఫ్యాన్స్, మీడియా నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది.
