తొలి చిత్రం ‘రన్ రాజా రన్’తో టాలీవుడ్ ప్రముఖుల దృష్టిలో పడ్డాడు దర్శకుడు సుజిత్. అయితే ఆ తర్వాత కూడా యూవీ క్రియేషన్స్ బ్యానర్ లోనే పాన్ ఇండియా మూవీ ‘సాహో’ను చేశాడీ యంగ్ డైరెక్టర్. ఊహించని విధంగా ‘సాహో’ తెలుగు ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం అయ్యింది. అయినా… ఉత్తరాదిన మాత్రం సుజిత్ కు మేకర్ గా మంచి పేరే వచ్చింది. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి మలయాళ ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ బాధ్యతలను సుజిత్ కు అప్పగించారు. ఆ చిత్రాన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా సుజిత్ మార్పులు చేర్పులు చేస్తున్న క్రమంలోనే అతని నుండి ఈ క్రేజీ ప్రాజెక్ట్ చేజారి పోయింది. ఆ తర్వాత ‘లూసిఫర్’ రీమేక్ వి. వి. వినాయక్ చేయబోతున్నాడనే గుసగుసలు వినిపించినా… చివరకు అది ప్రముఖ నిర్మాత, ‘ఎడిటర్’ మోహన్ తనయుడు మోహన్ రాజా చేతిలో పడింది. అతి త్వరలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతోంది.
Read Also : ఎట్టకేలకు స్పందించిన శిల్పాశెట్టి… భర్త కేసుపై సుదీర్ఘ వివరణ
ఇదిలా ఉంటే… ‘లూసిఫర్’ ప్రీ ప్రొడక్షన్ సందర్భంగా మెగా ఫ్యామిలీతో సుజిత్ కు ఏర్పడిన అనుబంధం వృధా కాలేదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను దృష్టి లో పెట్టుకుని సుజిత్ ఓ కథ తయారు చేశాడట. దానికి చెర్రీ సైతం ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ప్రస్తుతం ‘ట్రిపుల్ ఆర్’, ‘ఆచార్య’ చిత్రాలలో నటిస్తున్న రామ్ చరణ్ ఆ తర్వాత శంకర్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించే మూవీ చేయబోతున్నాడు. దాని తర్వాత సుజిత్ సినిమా మొదలు కావచ్చునని తెలుస్తోంది. దీన్ని సుజిత్ తో తొలి రెండు సినిమాలు ‘రన్ రాజా రన్, సాహో’ ను నిర్మించిన యూవీ క్రియేషన్స్ సంస్థే నిర్మిస్తుందట. మొత్తానికి మెగా స్టార్ చిత్రం మిస్ అయినా… మెగా పవర్ స్టార్ ప్రాజెక్ట్ సుజిత్ కు లభించడం గ్రేట్ అంటున్నారు సినీజనం.
