ఇనాగరల్ ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా భారత ఆర్చరీ అసోసియేషన్ ప్రకటించింది. అక్టోబర్ 2 నుంచి 12 వరకు ఢిల్లీ యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఈ తొలి ఎడిషన్ జరగనుంది. ఆర్చరీ ప్రీమియర్ లీగ్ మొదటి సారిగా జరుగుతున్న ఫ్రాంచైజీ బేస్డ్ ఆర్చరీ టోర్నమెంట్. ఇందులో భారత్‌తో పాటు ప్రపంచం నలుమూలల నుంచి అగ్రశ్రేణి ఆర్చర్లు పాల్గొనబోతున్నారు. ఈ లీగ్ ప్రధాన ఉద్దేశం భారతదేశ ఒలింపిక్ కలను బలపరచడం, దేశంలో ఆర్చరీ క్రీడను మరింతగా పెంచడం, అంతర్జాతీయంగా దాని పేరు ప్రతిష్టలను పెంచడం. ఇందులో మొత్తం 6 జట్లు ఉంటాయి. వీటిలో 36 మంది అగ్రశ్రేణి భారత ఆర్చర్లు, 12 మంది అంతర్జాతీయ ఆర్చర్లు ఉంటారు. వారిలో కొంతమంది ప్రపంచ టాప్ 10లో ఉన్నవాళ్లే. ప్రపంచంలో తొలిసారిగా, రికర్వ్ – కాంపౌండ్ ఆర్చర్లు కలిసి, లైట్స్ కింద పోటీపడే కొత్త ఫార్మాట్‌ని ఈ లీగ్ పరిచయం చేస్తుంది.
రామ్ చరణ్ మాట్లాడుతూ.. ఆర్చరీ అనేది క్రమశిక్షణ, ఏకాగ్రత, ధైర్యానికి ప్రతీక. ఇవి నాకు కూడా చాలా దగ్గరైన విలువలు. ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌లో భాగం కావడం నాకు గర్వంగా ఉంది. ఇది భారత ప్రతిభకు ప్రపంచ స్థాయి వేదికను ఇస్తుంది. ఈ ప్రయత్నం ద్వారా కొత్త తరం అథ్లెట్లను స్ఫూర్తినివ్వాలని ఆశిస్తున్నాను అని అన్నారు.
ఆర్చరీ ప్రీమియర్ లీగ్:
తేదీలు – అక్టోబర్ 2 నుండి 12, 2025 వరకు
వేదిక – యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్, న్యూఢిల్లీ
ఫార్మాట్ – ఆరు జట్లు, 36 మంది భారతీయ ఆర్చర్లు + 12 మంది అగ్ర అంతర్జాతీయ ఆర్చర్లు
ఆర్చరీ ప్రీమియర్ లీగ్ కు వరల్డ్ ఆర్చరీ, వరల్డ్ ఆర్చరీ ఆసియా, భారత క్రీడా మంత్రిత్వ శాఖ నుండి బలమైన ప్రోత్సాహం లభించింది.