NTV Telugu Site icon

Ram Charan : ఎ.ఆర్‌.రెహ్మాన్‌కిచ్చిన మాట నిలబెట్టుకున్న మెగా పవర్ స్టార్

Charan

Charan

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.. ఆస్కార్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ్మాన్‌కిచ్చిన మాట‌ను నిల‌బెట్టుకున్నారు. క‌డ‌ప ద‌ర్గాను సంద‌ర్శిస్తాన‌న్న చ‌ర‌ణ్‌.. ఇచ్చిన మాట ప్ర‌కారం క‌డ‌ప ద‌ర్గాలో జ‌రిగిన 80వ జాతీయ ముషైరా గ‌జ‌ల్ ఈవెంట్‌కు హాజ‌ర‌య్యారు. ఈ ద‌ర్గాను ఎ.ఆర్‌.రెహ్మాన్‌ క్ర‌మ త‌ప్ప‌కుండా సంద‌ర్శిస్తుంటారు. 2024లో ఇక్క‌డ జ‌రిగే 80వ జాతీయ ముషైరా గ‌జ‌ల్ ఈవెంట్‌కు చ‌ర‌ణ్‌ను తీసుకొస్తాన‌ని ఆయ‌న అన్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న చ‌ర‌ణ్‌ను ఆహ్వానించారు. ఓ వైపు బిజీ షెడ్యూల్‌.. మ‌రో వైపు అయ్య‌ప్ప స్వామి దీక్ష‌లో ఉన్న‌ప్ప‌టికీ రెహ్మాన్‌తో ఉన్న అనుబంధం కార‌ణంగా కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు చ‌ర‌ణ్‌. ఇది అక్క‌డి వారికి ఎంతో ప్ర‌త్యేకంగా నిలిచింది.

ఈ సంద‌ర్భంగా గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ మాట్లాడుతూ ‘‘కడప దర్గాతో నాకెంతో అనుబంధం ఉంది. ఈ ద‌ర్గా రుణం తీర్చుకోలేనిది. ఎందుకంటే, నా కెరీర్‌లో ఎంతో ముఖ్య‌మైన మ‌గ‌ధీర సినిమా రిలీజ్ ముందు రోజు నేను ఈ ద‌ర్గాను సంద‌ర్శించుకున్నాను. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యి, మంచి స్టార్ డ‌మ్ తీసుకొచ్చిందో అంద‌రికీ తెలిసిందే. అలాగే ఎ.ఆర్‌.రెహ్మాన్‌గారు ఈ ద‌ర్గాలో జ‌రిగే కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావాలంటూ మూడు నెల‌ల ముందే ఆహ్వానించారు. నేను కూడా వ‌స్తాన‌ని ఆయ‌న‌తో అన్నాను. ఆయ‌న‌కు ఇచ్చిన మాట కోసం, మాల‌లో ఉన్నా కూడా ఈ ద‌ర్గాకు వ‌చ్చాను. ఇక్క‌డ‌కు రావ‌టం ఎంతో ఆనందంగా ఉంది’’ అన్నారు. రామ్ చరణ్ రాకతో కడప వీధులన్నీ ఫాన్స్ తో నిండిపోయాయి. తమ అభిమాన హీరో తమ ఊరు రావడంతో భారీ ర్యాలీ నిర్వహించారు ఫ్యాన్స్.