Raja Kumari : మ్యూజిక్ డైరెక్టర్‌గా సింగర్ రాజకుమారి.. ‘ఇంప్యూర్’ తో సెన్సేషన్!

Rajakumari

Rajakumari

పవన్ కళ్యాణ్ ‘ఓజీ’లో ఫైర్ స్ట్రోమ్ సాంగ్ విన్నారా? షారుఖ్ ఖాన్ ‘జవాన్’ టైటిల్ ట్రాక్, రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సాంగ్ లతో ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకునేలా చేసిన ఇంటర్నేషనల్ పాప్ సెన్సేషన్, అమెరికన్ ర్యాపర్ రాజకుమారి అందరికీ సుపరిచితమే. తన గొంతుతో బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించే ఈ గ్లోబల్ స్టార్.. ఇప్పుడు ఏకంగా ఓ కొత్త అవతారం ఎత్తారు. తెలుగు ఇండస్ట్రీలోకి ఆమె ఏకంగా ‘సంగీత దర్శకురాలిగా’ (మ్యూజిక్ డైరెక్టర్) అడుగుపెట్టడం ఇప్పుడు టాలీవుడ్‌లో సెన్సేషనల్ టాపిక్‌గా మారింది.

అమెరికాలో స్థిరపడిన తెలుగమ్మాయి వారాహి మల్లిపాముల ప్రధాన పాత్రలో నటిస్తూ, తన తల్లి శ్రీదేవి మల్లిపాములతో కలిసి నిర్మిస్తున్న ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ ‘ఇంప్యూర్’ (Impure). ఈ విభిన్నమైన చిత్రంతోనే రాజకుమారి మ్యూజిక్ డైరెక్టర్‌గా సినీ ప్రపంచానికి పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ‘ఓఎంజీ’ (OMG – ఓ మై గాడ్) సంగీత్ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కడలి సత్యనారాయణ అందించిన అద్భుతమైన తెలుగు లిరిక్స్ కు రాజకుమారి తనదైన స్టైల్ లో వాయిస్ తో పాటు మ్యూజిక్ అందించి ప్రాణం పోశారు. పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సాంగ్ తర్వాత రాజకుమారి పాడిన తెలుగు పాట ఇదే కావడం విశేషం. అంతేకాదు, ఈ సినిమాలో రాజకుమారి ఒక స్పెషల్ గెస్ట్ రోల్ లో కూడా నటించి స్క్రీన్ పై తళుక్కున మెరవనున్నారు!

యష్న, వారాహి, సాయి కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో బిగ్ బాస్ ఫేమ్ అభిజీత్, కిరీటి దామరాజు, ఆర్జే కాజల్, శ్రీవాణి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ వీఎస్ అద్భుతమైన విజువల్స్ అందించారు. అశుతోష్ మతేల, రామకృష్ణ ఆరమ్ ఎడిటింగ్ బాధ్యతలు చూసుకున్నారు. రాజకుమారితో పాటు కరణ్ పాండవ్ కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించగా.. కరణ్ పాండవ్, నిర్వాణ్ ఆత్రేయ ఒరిజినల్ స్కోర్ అందించారు.’ఇంప్యూర్’ గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న గ్రాండ్ గా థియేటర్లలోకి రాబోతోంది.