ఢిల్లీకి చెందిన నటుడు, యూ ట్యూబర్ రాహుల్ వోరా (35) కరోనా సెకండ్ వేవ్ కోరల్లో చిక్కి ఆదివారం కన్నుమూశాడు. గత కొంతకాలంగా రాహుల్ కరోనాతో పోరాడుతున్నాడు. అతన్ని మొన్న రాజీవ్ గాంధీ హాస్పిటల్ నుండి ద్వారకాలోని ఆశ్రమ్ హాస్పిటల్ కు షిఫ్ట్ చేశారు. దానికి రెండు రోజుల ముందే తనకు ఆక్సిజన్ బెడ్ దొరకడం లేదని, ఏం చేయాలో పాలు పోవడం లేదని రాహుల్ వోరా ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టాడు. మరీ బాధాకరం ఏమంటే… మరికొద్ది గంటల్లో చనిపోతాననగా రాహుల్ ‘నాకు చక్కని వైద్యం సకాలంలో లభించి ఉంటే బతికే వాడినేమో, కానీ అలా జరగలేదు. కొన్ని మంచి పనులు చేయడానికైనా మళ్ళీ నేను జన్మిస్తాను. ఇప్పుడైతే పూర్తిగా ధైర్యం కోల్పోయాను’ అంటూ తన అస్సహాయతను సోషల్ మీడియాలో వెలిబుచ్చాడు. రాహుల్ మరణంతో తనో గొప్ప నటుడిని కోల్పోయానంటూ నాటక రచయత, దర్శకుడు అరవింద్ గౌర్ వాపోయాడు. కరోనా కర్కసి ఈసారి మాత్రం నిర్ధయగా యువతరాన్ని సైతం కబళించేస్తోంది.