Site icon NTV Telugu

నేను చాలా రిచ్: ఆర్. నారాయణమూర్తి

R Narayana Murthy Responds about his Financial Situation

పీపుల్ స్టార్ ఆర్. నారాయణమూర్తి మీద ఇటీవల సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. ఆయన ఆర్థికంగా చితికి పోయారని, ఉండటానికి సొంత ఇల్లు కూడా లేక హైదరాబాద్ శివార్లలో అద్దె ఇంట్లో ఉంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఇటీవల ‘రైతన్న’ సినిమా ప్రివ్యూ సందర్భంగా గద్దర్ మాట్లాడిన మాటలను అందుకు వారు ఆధారంగా చూపిస్తున్నారు. అయితే ఈ పుకార్లను ఆర్. నారాయణమూర్తి ఖండించారు. గద్దర్ తన గురించి ప్రేమతో, అభిమానంతో అలా చెప్పారే కానీ తాను రిచ్ అని నారాయణమూర్తి అన్నారు. అద్దె కట్టలేక ఇబ్బందులు పడుతున్నానన్న మాటల్లోనూ నిజం లేదని, తగిన స్వేచ్ఛ కోరుకునే తాను నగర శివార్లలో ఉంటున్నానని అన్నారు. నగరంలో ప్రయాణించడానికి తనకు ఆటోకి రోజుకు వెయ్యి రూపాయలు అవుతుందని, ఆ రకంగా ఆటోకే నెలకు 30 వేలు ఖర్చు చేస్తానని చెప్పారు. ప్రభుత్వ అధికారులు కొందరు గతంలో ఇల్లు ఇస్తానని చెప్పినా తాను తీసుకోలేదని అన్నారు. సోషల్ మీడియాలో తన ఆర్థిక పరిస్థితిపై రాస్తున్న అసత్య వార్తలు తన మనసుకు బాధను కలిగిస్తున్నాయని, దయచేసి అలాంటి వాటిని ప్రచారం చేయవద్దని కోరారు. గతంలోనే తాను పలు సూపర్ హిట్ చిత్రాలను నిర్మించానని, తనకు అవసరం అయితే సాయం చేసే స్నేహితులు ఉన్నా… వారిని ఉపయోగించుకోవడం తనకు ఇష్టం ఉండదని నారాయణమూర్తి చెప్పారు.

Read Also : హైదరాబాద్ లో మొదలైన మోహన్ లాల్ కొత్త సినిమా షూటింగ్

ఇదిలా ఉంటే స్వతహాగా నటుడైన ఆర్. నారాయణమూర్తి 1985లో స్నేహచిత్ర పతాకాన్ని స్థాపించి ‘అర్థరాత్రి స్వాతంత్రం’ మూవీతో దర్శక నిర్మాతగా మారారు. అప్పటి నుండి ఇప్పటి వరకూ మడమ తిప్పకుండా…. ఒకే పంథాలో సినిమాలను స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తూనే ఉన్నారు. అభ్యుదయ, విప్లవాత్మక భావాలతో తనను కథానాయకుడిగా పెట్టి ఎవరైన సినిమాలు నిర్మిస్తే, అందులో నటిస్తున్నారు. గత కొంతకాలంగా ఆర్. నారాయణమూర్తి తెరకెక్కించిన సినిమాలు ఆర్థికంగా పెద్దంత లాభాలు తెచ్చిపెట్టడం లేదన్నది వాస్తవమే. అయితే… ఆయన చిత్రాలు ఘన విజయాలను సాధించి, భారీ రాబడులను అందించిన సమయంలో తన సొంతవూరిలో పలు ప్రజా ప్రయోజన కార్యక్రమాలను ఆర్. నారాయణమూర్తి చేపట్టారు. దాంతో ఆర్. నారాయణమూర్తి సహృదయత కారణంగా సినిమాల జయాపజయాలతో నిమిత్తం లేకుండా నటీనటులు, సాంకేతిక నిపుణులు ఆయనకు సినిమాల రూపకల్పనలో సహకారం అందిస్తుంటారు.

Exit mobile version