Husharu 2: చాలా ఏళ్ల తర్వాత నాకు మంచి రోల్ దక్కింది: ఆర్. నారాయణమూర్తి

Husharu 2

Husharu 2

Husharu 2: పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి వెండితెరపై కనిపించి చాలా కాలమే అయింది. తనదైన విప్లవాత్మక, సందేశాత్మక చిత్రాలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆయన, తాజాగా యూత్‌ఫుల్ మూవీ ‘హుషారు 2’లో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్ర టీజర్ లాంచ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా వచ్చిన నారాయణమూర్తి.. చాలా ఏళ్ల తర్వాత తనకు ఇంత గొప్ప పాత్ర దక్కడంపై మనసు విప్పి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ.. “దర్శకుడు శ్రీ హర్ష గారు ‘హుషారు 2’లో నాకు చాలా గొప్ప పాత్ర ఇచ్చారు. నిజం చెప్పాలంటే ఎన్నో ఏళ్ల తర్వాత నాకు ఇంతటి సంతృప్తినిచ్చే మంచి క్యారెక్టర్ దొరికింది” అంటూ సంతోషం వ్యక్తం చేశారు. తన పాత్ర ద్వారా నేటి తరానికి బలమైన విషయాన్ని చెప్పే అవకాశం ఇచ్చినందుకు ఆయన దర్శకుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

డైరెక్టర్ పనితీరును మెచ్చుకుంటూ నారాయణమూర్తి పెద్ద స్టేట్‌మెంట్ ఇచ్చారు. “దర్శకుడు హర్ష పని విషయంలో అస్సలు తగ్గడు, ఎక్కడా రాజీ పడడు. లెజెండరీ దర్శకుడు రవిరాజా పినిశెట్టి తర్వాత నాకు మళ్లీ హర్షలోనే ఆ పట్టుదల, రాజీపడని ఆ క్వాలిటీ కనిపించింది” అని చెప్పారు. మంచి సినిమా తీయాలనే తపన ఉన్న ఇలాంటి దర్శకులను ఆడియన్స్ తప్పకుండా ఆదరిస్తారని అన్నారు. ‘హుషారు 2’ సినిమా కేవలం కామెడీ కోసమే కాకుండా సమాజం ఆలోచించేలా ఉంటుందని నారాయణమూర్తి స్పష్టం చేశారు. ముఖ్యంగా నేటి యువతరం ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్యను, శ్రమకు తగ్గ గుర్తింపు లేక నలిగిపోతున్న తీరును సినిమాలో చాలా సహజంగా చూపించారని చెప్పారు. కుర్రాళ్లు ఆత్మాభిమానంతో, స్వేచ్ఛగా తమ కాళ్లపై తాము ఎలా నిలబడాలనే మంచి సందేశాన్ని ఇచ్చారని, ఈ చిత్రం కచ్చితంగా పెద్ద హిట్ కొడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

దర్శకుడు శ్రీ హర్ష మాట్లాడుతూ.. నారాయణమూర్తి లాంటి సీనియర్ నటుడితో పనిచేయడం తనకు దక్కిన గొప్ప గౌరవమని చెప్పారు. థియేటర్లలో ఆయనతో వచ్చే సీన్లు ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్విస్తూనే క్లాప్స్ కొట్టిస్తాయని నమ్మకం వ్యక్తం చేశారు. తన రియల్ లైఫ్ ఫ్రెండ్స్‌తో జరిగిన సంఘటనల ఆధారంగానే ‘హుషారు 2’ను తెరకెక్కించినట్లు ఆయన తెలిపారు. అశోక్ గల్లా, రాహుల్ రామకృష్ణ, దినేష్ తేజ్, రవి ఆంటోనీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌తోనే మంచి బజ్ తెచ్చుకుంది. ఎన్నో ఏళ్ల తర్వాత నారాయణమూర్తిని కొత్త లుక్‌లో, సరికొత్త పాత్రలో చూసేందుకు ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.